Mahindra : మహీంద్రా ధమాకా.. ఒకేసారి నాలుగు కొత్త ఎస్‌యూవీ కాన్సెప్ట్‌లు విడుదల
ఒకేసారి నాలుగు కొత్త ఎస్‌యూవీ కాన్సెప్ట్‌లు విడుదల

Mahindra : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక పెద్ద ప్రకటన చేసింది. ఫ్రీడమ్ ఎన్‌యూ అనే కార్యక్రమం ద్వారా ఒకేసారి నాలుగు కొత్త ఎస్‌యూవీ కాన్సెప్ట్‌లను ఆవిష్కరించింది. ఈ సరికొత్త మోడళ్లు - విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎస్‌ఎక్స్టీ. ఈ నాలుగు కాన్సెప్ట్‌లు వేర్వేరు డిజైన్లు, విభాగాలకు చెందినవి అయినప్పటికీ, వీటిని ఒకే ప్లాట్‌ఫామ్ ఎన్‌యూ.ఐక్యూ పై రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తులో భారతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం తయారు చేయబోయే కార్లకు ఉపయోగపడుతుంది.
విజన్ టీ, విజన్ ఎస్‌ఎక్స్టీ
మహీంద్రా విజన్ టీ, విజన్ ఎస్‌ఎక్స్టీ కాన్సెప్ట్‌లు థార్.ఈ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తున్నాయి. విజన్ టీ ఒక క్లాసిక్ బాక్సీ డిజైన్‌తో ఎస్‌యూవీ ప్రియులను ఆకర్షిస్తుంది. ఇది సాంప్రదాయకమైన, కానీ పవర్ఫుల్ లుక్ ఇస్తుంది. మరోవైపు, విజన్ ఎస్‌ఎక్స్టీ ఒక పికప్ ట్రక్ లాంటి డిజైన్‌తో వచ్చింది. దీనిలో స్పేర్ వీల్‌ను వెనుక భాగంలో ఉంచారు. ఈ రెండు మోడళ్లు ఆఫ్-రోడింగ్, సాహస యాత్రలకు అనువుగా ఉండేలా రూపొందించబడ్డాయి. అయితే, వీటిని రోజూవారీ అవసరాలకు అనుగుణంగా మార్చే అవకాశం ఉంది.
విజన్ ఎస్
విజన్ ఎస్ కాన్సెప్ట్ ఒక అడ్వాన్సుడ్, స్టైలిష్ డిజైన్‌తో ముందుకు వచ్చింది. దీని ముందు భాగంలో నిలువుగా ఉండే ఎల్‌ఈడీ లైట్లు, ఎల్-ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇవి కారుకు స్పెషల్ లుక్ ఇస్తాయి. ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి, ఇందులో రూఫ్-మౌంటెడ్ లైట్లు, దృఢమైన బంపర్లు, సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్,పెద్ద వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కొత్త అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. భవిష్యత్తులో ఈ డిజైన్లో కొన్ని అంశాలు బొలెరో వంటి మోడళ్లలో కూడా కనిపించవచ్చని భావిస్తున్నారు.
విజన్ ఎక్స్
విజన్ ఎక్స్ అనేది అత్యంత ఆకర్షణీయమైన, షార్ప్ డిజైన్‌తో రూపొందించబడిన కాన్సెప్ట్. దీని సన్నని హెడ్‌ల్యాంప్‌లు, స్లీక్ ఎయిర్ ఇన్‌టేక్, పొడవైన హుడ్ ఈ కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. దీని పైకప్పు డిజైన్ కూపే లాగా వంగి ఉంటుంది. ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ రియర్ బంపర్ ఈ కారుకు ఫ్యూచరిస్టిక్, ప్రీమియం రూపాన్ని ఇస్తాయి. ఇది యువతను ఆకట్టుకునేలా రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
మహీంద్రా విజన్
ఈ నాలుగు కాన్సెప్ట్‌లను ఆవిష్కరించడం ద్వారా మహీంద్రా కేవలం దేశీయ మార్కెట్‌పైనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్‌యూవీ మార్కెట్‌లోనూ తమ పట్టును చాటుకోవాలని చూస్తోంది. విభిన్న డిజైన్‌లు, లక్షణాలు ఉన్నప్పటికీ, ఒకే ప్లాట్‌ఫామ్‌పై వీటిని తయారు చేయడం ద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గడం, టెక్నాలజీని పంచుకోవడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇది మహీంద్రా భవిష్యత్తు ప్రణాళికలకు నిదర్శనం.
