Volkswagen Taigun : భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లు రారాజుల్లా వెలుగొందుతున్నాయి. అయితే, ఇప్పుడు వీటికి జర్మన్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆ కంపెనీకి చెందిన టైగూన్ 2026 ఏప్రిల్ నెలలో అనూహ్యమైన అమ్మకాలను నమోదు చేసింది. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, టైగూన్ సాధించిన వృద్ధి ఇప్పుడు ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఏప్రిల్ 2026 నెలలో ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. గణాంకాలను పరిశీలిస్తే, మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో ఈ కారు అమ్మకాలు ఏకంగా 70 శాతం పెరిగాయి. మార్చిలో కేవలం 908 యూనిట్లు అమ్ముడవగా, ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య 1,543 యూనిట్లకు చేరుకుంది. ఇక వార్షిక వృద్ధి విషయానికి వస్తే, గతేడాది ఏప్రిల్‌లో జరిగిన 1,155 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 34 శాతం పెరుగుదల నమోదైంది. క్రెటా, సెల్టోస్‌ల అమ్మకాల సంఖ్యతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, టైగూన్ సాధిస్తున్న ఈ స్థిరమైన వృద్ధి ప్రత్యర్థులకు హెచ్చరిక లాంటిదే.

ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీల హవా కొంత నెమ్మదించింది. కస్టమర్లు మళ్లీ చిన్నపాటి కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు లేదా పెద్ద 7-సీటర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా టైగూన్ పుంజుకోవడం విశేషం. జర్మన్ ఇంజనీరింగ్, గట్టి బాడీ స్ట్రక్చర్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ అనుభవాన్ని అమితంగా ఇష్టపడే వారు టైగూన్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

టైగూన్ అమ్మకాలు పెరగడానికి మరో ముఖ్య కారణం.. ఇటీవల లాంచ్ అయిన టైగూన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్. సుమారు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ కొత్త వెర్షన్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో డిజైన్ పరంగా చిన్నపాటి మార్పులు చేయడంతో కారు మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. కొత్త అల్లాయ్ వీల్స్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు దీనికి తోడయ్యాయి. లోపల పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు లగ్జరీ అనుభూతిని ఇస్తున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ సంస్థ భారత్‌లో తన ఉనికిని చాటుకోవడానికి దేశీయ తయారీపై పట్టు సాధిస్తోంది. టైగూన్ కారును మన దేశ వాతావరణం, రోడ్ల పరిస్థితికి తగ్గట్టుగా ఇక్కడే తయారు చేస్తున్నారు. దీంతో క్వాలిటీ తగ్గకుండానే ధరను అందుబాటులో ఉంచగలుగుతున్నారు. సేఫ్టీ విషయంలో కూడా టైగూన్ ఎక్కడా తగ్గదు. గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్‌లో ఇది ఇప్పటికే తన సత్తా చాటింది. అందుకే సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే ఫ్యామిలీస్ ఇప్పుడు టైగూన్ షోరూమ్‌ల బాట పడుతున్నారు. వచ్చే నెలల్లో ఈ జోరు ఇలాగే కొనసాగితే సెగ్మెంట్ లీడర్లకు టైగూన్ అసలైన తలనొప్పిగా మారడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story