Volvo EX90: ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో భారతీయ మార్కెట్లో తన సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని అధికారికంగా విడుదల చేసింది. వోల్వో EX90 పేరుతో వస్తున్న ఈ ప్రీమియం లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.26 కోట్లుగా నిర్ణయించారు. కంపెనీ తరఫున భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన, అత్యున్నత శ్రేణి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. 6 సీట్ల సామర్థ్యంతో ఫుల్లీ లోడెడ్ అల్ట్రా వేరియంట్‌లో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.

బ్యాటరీ కెపాసిటీ, రేంజ్

ఈ లగ్జరీ ఎస్‌యూవీలో అత్యంత పవర్ ఫుల్ 106kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో ఉన్న రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి 456hp పవర్, 670Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు కేవలం 5.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇక ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 625 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే 350kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ కేవలం 22 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

డిజైన్, లగ్జరీ ఇంటీరియర్

వోల్వో సిగ్నేచర్ స్టైల్‌లో రూపొందిన ఈ కారులో టీ-షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 21 అంగుళాల అలాయ్ వీల్స్, సీ-షేప్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఇచ్చారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210mm ఉండగా, ఎయిర్ సస్పెన్షన్ సహాయంతో దీనిని 250mm వరకు పెంచుకోవచ్చు. కేబిన్ లోపల 14.5 అంగుళాల టచ్‌స్క్రీన్, 9 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. 6 సీట్ల మోడల్‌లో ప్రత్యేకమైన కెప్టెన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 25-స్పీకర్ల బోవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ సిస్టమ్ అమర్చారు.

అత్యున్నత భద్రత, అడ్వాన్స్డ్ ఫీచర్లు

సేఫ్టీకి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతనిచ్చే వోల్వో, ఈ మోడల్‌లో ఏకంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. వీటితో పాటు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెన్స్ ఉన్నాయి. డిసెంబర్ 31, 2026 వరకు బుకింగ్స్ చేసుకునే కస్టమర్లకు 11kW హోమ్ ఛార్జర్, 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ, 3 ఏళ్ల తర్వాత 65 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ వంటి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. మార్కెట్లో ఇది కియా ఈవీ9, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Next Story