Volvo: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో గ్లోబల్ మార్కెట్‌లో తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలు XC60, XC90లకు సంబంధించిన అప్‌డేటెడ్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ రెండు లగ్జరీ ఎస్‌యూవీల్లో కంపెనీ గతంలో కంటే చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. దీనివల్ల ఈ కార్ల ఎలక్ట్రిక్ డ్రైవింగ్ రేంజ్ అద్భుతంగా పెరిగింది. ముఖ్యంగా XC60 PHEV మోడల్ కేవలం ఎలక్ట్రిక్ పవర్‌పైనే ఏకంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం విశేషం.

గతంలో ఈ వోల్వో ఎస్‌యూవీల్లో 19kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు దాని స్థానంలో ఏకంగా 41.2kWh కెపాసిటీ గల భారీ బ్యాటరీని చేర్చారు. ఇందులో సుమారు 37.9kWh బ్యాటరీ ప్యాక్‌ను వాడకానికి ఉపయోగించుకోవచ్చు. అంటే బ్యాటరీ సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ఫలితంగా ఎలక్ట్రిక్ రేంజ్‌లో భారీ పెరుగుదల నమోదైంది. కొత్త XC60 PHEV ఎలక్ట్రిక్ రేంజ్ గతంలో కేవలం 79 కి.మీ ఉండగా, ఇప్పుడు అది ఏకంగా 200 కి.మీకి చేరుకుంది. అలాగే XC90 PHEV రేంజ్ కూడా మునుపటి 66 కి.మీ నుంచి 162 కి.మీకి పెరిగింది. దీనివల్ల నగరాల్లో రోజూ ఆఫీసుకు వెళ్లేవారు పెట్రోల్ ఇంజిన్ అవసరం లేకుండానే ప్రయాణం సాగించవచ్చు.

ఈ రెండు ఎస్‌యూవీల్లో శక్తివంతమైన 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది ముందు చక్రాలకు శక్తినిస్తుంది. వెనుక వైపు ఎలక్ట్రిక్ మోటార్ ఉండటం వల్ల ఈ కార్లకు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ లభిస్తుంది. XC60 మొత్తం 461 hp పవర్, 759 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే XC90 కూడా 461 hp పవర్, 751 Nm టార్క్‌ను అందిస్తుంది. వేగం విషయంలోనూ ఇవి అదుర్స్ అనిపించనున్నాయి. XC60 కేవలం 4.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగా, XC90 కేవలం 5.2 సెకన్లలోనే ఈ మార్క్‌ను చేరుకుంటుంది.

అయితే, ప్రస్తుతం ఈ అధునాతన PHEV మోడళ్లు భారత మార్కెట్లో విక్రయానికి అందుబాటులో లేవు. భారత్‌లో వోల్వో XC60, XC90 కార్లు 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తున్నాయి. ఈ ఇంజిన్ 250 hp పవర్, 360 Nm టార్క్‌ను ఇస్తుంది. ప్రస్తుతం భారత్‌లో XC60 ఎక్స్-షోరూమ్ ధర రూ. 70.90 లక్షలు కాగా, XC90 ధర రూ. 98.80 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. మునుముందు ఈ సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను కూడా భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story