త్వరలోనే వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్

WagonR Electric : భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల హవా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లను తయారుచేసే సుజుకి కూడా ఈవీ సెగ్మెంట్‌లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా సుజుకి మోస్ట్ పాపులర్ మోడల్ అయిన వ్యాగన్ఆర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్ లో రాబోతోంది. సుజుకి రాబోయే జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించనున్న విజన్ ఇ-స్కై కాన్సెప్ట్ గురించి, దాని అంచనా ఫీచర్లు, డిజైన్, 270 కి.మీ రేంజ్ వివరాలను తెలుసుకుందాం.

సుజుకి రాబోయే జపాన్ మొబిలిటీ షో (అక్టోబర్ 29, 2025) లో విజన్ ఇ-స్కై అనే ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. దీనిని వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్గా భావిస్తున్నారు. ఈ కొత్త కాన్సెప్ట్‌లో డిజైన్ పరంగా చాలా కొత్తదనం కనిపిస్తుంది. ముందు భాగంలో పిక్సెల్-స్టైల్ లైటింగ్ ఎలిమెంట్స్, C-ఆకారపు LED DRLలు ఉంటాయి. అలాగే, ఎలక్ట్రిక్ వాహనం కావడంతో, దీనికి క్లోజ్డ్ గ్రిల్, ఫ్లాట్ బంపర్ సెక్షన్‌ను అందించారు. కారు పైకప్పు ఫ్లాట్‌గా ఉండడం వల్ల ఈ హ్యాచ్‌బ్యాక్‌కు స్పోర్టీ లుక్ వస్తుంది.

వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ సైడ్ ప్రొఫైల్‌లో కూడా అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రిట్రాక్టబుల్ డోర్ హ్యాండిల్స్, కొత్త అల్లాయ్ వీల్స్, బ్లాక్ కలర్ A, B పిల్లర్‌లు ఉన్నాయి. ఈ డిజైన్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. వెనుక భాగంలో C-ఆకారపు టెయిల్‌లైట్లు, ఫ్లాట్ బంపర్, విశాలమైన విండ్‌స్క్రీన్ లభించనున్నాయి. మొత్తం మీద ఈ కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ స్టాండర్డ్ వ్యాగన్ఆర్ కంటే చాలా స్టైలిష్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతోంది.

కారు లోపలి భాగంలో కూడా టెక్నాలజీకి పెద్ద పీట వేశారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. వీటి సైజు సుమారు 12 అంగుళాలు ఉండవచ్చు. సెంట్రల్ కన్సోల్‌లో మిర్రర్ థీమ్ను ఉపయోగించారు. డాష్‌బోర్డ్, డోర్‌లలో యాంబియెంట్ లైటింగ్ ఉంటుంది. ఇది కేబిన్‌కు మంచి లగ్జరీ అనుభూతిని ఇస్తుంది.

అలాగే, ఫ్లోటింగ్ కన్సోల్లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, కొన్ని ఫిజికల్ బటన్స్ ఉంటాయి. ఇందులో 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టోరేజీ కోసం అనేక సౌకర్యాలు ఉండే ట్రే-స్టైల్ డాష్‌బోర్డ్ ఉంటుంది. సుజుకి అంచనా ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story