Driving Tips : దేశవ్యాప్తంగా కొత్త ఈ20 పెట్రోల్ వాడకం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వాహనదారుల్లో మైలేజీపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ20 ఇంధనం వల్ల మైలేజ్ కాస్త తగ్గే అవకాశం ఉందనే విషయాన్ని స్వయంగా ప్రభుత్వంతో పాటు వాహన తయారీ కంపెనీలు కూడా అంగీకరించాయి. అయితే కారు ఇచ్చే మైలేజ్ అనేది కేవలం పెట్రోల్ రకం పైనే కాకుండా, మనం కారును నడిపే విధానం, మెయింటెనెన్స్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అనుభవజ్ఞులైన డ్రైవర్లు కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి కారు నుంచి అద్భుతమైన మైలేజీని రాబడుతుంటారు. అసలు కారును ఎంత వేగంతో నడిపితే ఎక్కువ మైలేజ్ వస్తుందో ప్రతి వాహనదారుడు తప్పక తెలుసుకోవాలి.

రాకెట్ లా దూసుకెళ్తే రాపిడ్‌గా తగ్గే మైలేజ్

కారు మైలేజ్ దారుణంగా పడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం మితిమీరిన వేగంతో ప్రయాణించడం. చాలామంది హైవేలు కనిపించగానే కారును 100 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ స్పీడ్‌తో నడుపుతుంటారు. ఇలా కారును విపరీతమైన వేగంతో నడపడం వల్ల కారుకు ఎదురుగా వచ్చే గాలి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆ గాలిని తట్టుకుని కారు ముందుకు దూసుకెళ్లడానికి ఇంజన్ చాలా ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల సిలిండర్లలో ఇంధనం చాలా వేగంగా ఖర్చవుతుంది, ఫలితంగా మైలేజ్ భారీగా పడిపోతుంది.

తప్పుడు గేర్ల వాడకం, పదే పదే బ్రేకులు వేయడం

డ్రైవింగ్ చేసేటప్పుడు సరైన వేగానికి తగిన గేరును ఉపయోగించకపోవడం కూడా మైలేజీని దెబ్బతీస్తుంది. తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు టాప్ గేర్ వేయడం లేదా ఎక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు చిన్న గేరులోనే కారును లాగడం వల్ల ఇంజన్‌పై విపరీతమైన లోడ్ పడుతుంది. దీనితో పాటు, కొందరు డ్రైవర్లు కారును సడన్‌గా యాక్సిలరేట్ చేస్తూ, ఆ వెంటనే పదే పదే బ్రేకులు నొక్కుతుంటారు. ఇలాంటి స్టాప్ అండ్ గో డ్రైవింగ్ స్టైల్ వల్ల పెట్రోల్ అత్యధికంగా వృథా అవుతుంది. కారును ఎప్పుడూ ఒకే నిలకడైన వేగంతో నడపడం వల్ల మాత్రమే ఇంధనం ఆదా అవుతుంది.

హైవేపై ఆ స్పీడ్‌ మెయింటెనెన్స్ చేస్తేనే ఎక్కువ మైలేజ్

కారు నుంచి గరిష్టంగా లేదా బెస్ట్ మైలేజీని రాబట్టాలి అంటే 70 నుంచి 90 కిలోమీటర్ల వేగం అత్యంత అనువైనదిగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు హైవేలపై ప్రయాణించేటప్పుడు కారును 70-80 కిలోమీటర్ల వేగంతో ఉంచి, టాప్ గేర్ (5వ లేదా 6వ గేర్) లో క్రూజ్ చేయడం వల్ల ఇంజన్ చాలా రిలాక్స్‌డ్‌గా తక్కువ ఆర్‌పీఎమ్ (RPM) వద్ద రన్ అవుతుంది. ఈ వేగంలో ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండి, ఇంధన వినియోగం కూడా చాలా పొదుపుగా జరుగుతుంది.

ట్రాఫిక్‌లో పదే పదే బ్రేకులు వేస్తున్నారా?

ఇక నగరాలు లేదా విపరీతమైన ట్రాఫిక్ ఉండే రోడ్లపై హైవేల తరహాలో 80 స్పీడ్‌తో వెళ్లడం సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో కారు వేగాన్ని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్య స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ముందు వెళ్తున్న వాహనాలకు సరైన దూరం పాటిస్తూ నడపడం వల్ల పదే పదే బ్రేకులు వేయాల్సిన అవసరం తప్పుతుంది. సిటీ పరిమితుల్లో క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్లను సాఫీగా ఉపయోగించడం వల్ల ఈ20 పెట్రోల్ యుగంలోనూ మీ కారు నుంచి ఆశించిన దానికంటే మంచి మైలేజీని సులభంగా పొందవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story