Tata Punch EV vs Kia Syros EV : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక మోడళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నప్పటికీ, టాటా పంచ్ ఈవీ, కియా సైరోస్ ఈవీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కేవలం కారు ధర మాత్రమే కాకుండా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ వివరాలను కూడా పరిశీలించడం చాలా ముఖ్యం. టాటా పంచ్ ఈవీ తక్కువ బడ్జెట్‌లో లభించే ఎస్‌యూవీగా పేరుగాంచగా కియా సైరోస్ ఈవీ కాస్త ప్రీమియం విభాగంలో ఉంది.

టాటా పంచ్ ఈవీ నెలవారీ ఈఎంఐ ఎంతంటే?

టాటా పంచ్ ఈవీ ప్రారంభ బేస్ వేరియంట్ స్మార్ట్ 30 ఎక్స్-షోరూమ్ ధర రూ.9.69 లక్షలుగా ఉంది. అలాగే దీని టాప్ వేరియంట్ ఎంపవర్డ్+ S 40 ధర రూ.12.79 లక్షలు. ఎక్స్-షోరూమ్ ధర మొత్తాన్ని 9.5% వడ్డీ రేటుతో 48 నెలల (4 ఏళ్ల) కాలపరిమితికి రుణం పొందితే, పంచ్ ఈవీ స్మార్ట్ 30 వేరియంట్‌కు నెలకు సుమారు రూ.24,344 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టాప్ వేరియంట్ ఎంపవర్డ్+ S 40 కోసం ప్రతి నెల రూ.32,132 వరకు EMI అవుతుంది. అంటే ఈ రెండు వేరియంట్ల మధ్య నెలవారీ వాయిదా వ్యత్యాసం దాదాపు రూ.7,788గా ఉంటుంది.

కియా సైరోస్ ఈవీ నెలవారీ ఈఎంఐ ఎంత పడుతుంది?

ఇక కియా సైరోస్ ఈవీ విషయానికి వస్తే, దీని బేస్ వేరియంట్ HTK ఎక్స్-షోరూమ్ ధర రూ.13.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ 'X-Line ER' ధర రూ.20 లక్షల వరకు ఉంటుంది. సమానమైన 9.5% వడ్డీ రేటు, 4 ఏళ్ల రుణ కాలపరిమితి లెక్కన చూస్తే కియా సైరోస్ EV HTK బేస్ వేరియంట్‌కు నెలవారీ ఈఎంఐ సుమారు రూ.33,916 అవుతుంది. అదే విధంగా టాప్ వేరియంట్ X-Line ER మోడల్‌కు ప్రతినెలా రూ.50,246 భారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే సైరోస్ టాప్ మోడల్ EMI నెలకు రూ.50 వేలు దాటుతుంది.

రెండు కార్ల ఈఎంఐల మధ్య వ్యత్యాసం ఇదే

బేస్ వేరియంట్లను పోల్చి చూస్తే, టాటా పంచ్ ఈవీ ఈఎంఐ రూ.24,344 కాగా, కియా సైరోస్ ఈవీ ఈఎంఐ రూ.33,916గా ఉంది. అంటే బేస్ వేరియంట్లలోనే ప్రతినెలా రూ.9,572 వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక టాప్ వేరియంట్ల పోలికల్లో పంచ్ ఈవీ ఈఎంఐ రూ.32,132 కాగా, సైరోస్ ఈవీ ఈఎంఐ రూ.50,246గా ఉంది. అంటే టాప్ వేరియంట్లలో ప్రతినెలా దాదాపు రూ.18,114 వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ ఈఎంఐ అంచనాలు కేవలం ఉజ్జాయింపు మాత్రమేనని, కొనుగోలుదారులు చెల్లించే డౌన్ పేమెంట్, ఎంచుకునే బ్యాంకు వడ్డీ రేట్లు, లోన్ వ్యవధిని బట్టి ఈ మొత్తాలు మారుతాయని గమనించాలి. తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావాలనుకునే వారికి టాటా పంచ్ EV సరసమైన ఈఎంఐలతో ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story