Harley-Davidson : హార్లీ-డేవిడ్సన్ భారత్‌లో ఎందుకు బిజినెస్ ఆపేసింది? దీని వెనుక ఉన్న నిజాలేంటి?
దీని వెనుక ఉన్న నిజాలేంటి?

Harley-Davidson : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను విమర్శించడానికి తరచుగా హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల పేరును ప్రస్తావిస్తుంటారు. భారత్ ఈ బైక్‌లపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తోందని, అందుకే భారత్‌లో హార్లీ-డేవిడ్సన్ వ్యాపారం చేయలేకపోతుందని ఆయన పదేపదే చెబుతుంటారు. కానీ, వాస్తవానికి హార్లీ-డేవిడ్సన్ భారత్‌ను వీడటానికి పన్నులు మాత్రమే కారణం కాదు, ఇంకా చాలా ఇతర అంశాలు ఉన్నాయి. హార్లీ-డేవిడ్సన్ బైక్‌లను భారత్ అధిక టారిఫ్‌ల కారణంగానే దిగుమతి చేసుకోలేకపోయింది అని ట్రంప్ చెప్పేది సగం మాత్రమే నిజం. నిజానికి, భారత్ ఈ బైక్‌లపై 50-100 శాతం టారిఫ్‌లను విధించేది. 2018లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు భారత్ హార్లీ-డేవిడ్సన్ బైక్‌లపై పన్నులను 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది కూడా.
టారిఫ్‌లను తప్పించుకోవడానికి హార్లీ-డేవిడ్సన్ సంస్థ 2011లోనే హర్యానాలో ఒక ఫ్యాక్టరీని స్థాపించింది. భారతదేశంలోనే బైక్‌లను తయారు చేసి తక్కువ ధరకే విక్రయించాలని భావించింది. అయితే, ఈ ప్లాన్ కూడా అంతగా ఫలించలేదు. హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధర సగటున రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో బైక్‌లు కొనేవారు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే, బైక్‌ల అమ్మకాలు ఆశించినంత జరగలేదు.
2011 నుంచి 10 ఏళ్ల కాలంలో హార్లీ-డేవిడ్సన్ కేవలం 30,000 బైక్‌లను మాత్రమే విక్రయించగలిగింది. ఇతర ప్రముఖ వాహన బ్రాండ్స్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ సంఖ్య. ఫలితంగా, వ్యాపారంలో లాభాలు లేక 2020-21లో హార్లీ-డేవిడ్సన్ ఎవరికీ చెప్పకుండానే భారత్‌లో తన వ్యాపారాన్ని మూసేసి వెళ్లిపోయింది. హర్యానాలో తయారీ యూనిట్ ఉన్నప్పటికీ, హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధరలను తగ్గించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం, ఈ యూనిట్ పూర్తిస్థాయి తయారీ యూనిట్ కాదు. బైక్‌ల తయారీకి అవసరమైన చాలా విడిభాగాలను ఇంకా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గలేదు, అలాగే బైక్‌ల ధరలు కూడా భారీగానే ఉండిపోయాయి.
