E20 Petrol : ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వాహనదారుల మధ్య ఈ20 పెట్రోల్ పై ఒక పెద్ద చర్చ నడుస్తోంది. సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించే ఈ ఇంధనం వల్ల కార్లు, బైకుల ఇంజన్లు త్వరగా పాడైపోతాయంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద ఎస్‌యూవీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రంగంలోకి దిగింది. తమ పెట్రోల్ వాహనాలలో ఈ20 పెట్రోల్ వాడకం ఎంతవరకు సురక్షితం అనే విషయంపై మహీంద్రా అధికారికంగా స్పందిస్తూ వాహనదారుల అనుమానాలన్నింటికీ చెక్ పెట్టింది.

మహీంద్రా పెట్రోల్ కార్ల యూజర్లకు బిగ్ అలర్ట్

ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక కస్టమర్ అడిగిన ప్రశ్నకు మహీంద్రా కస్టమర్ కేర్ విభాగం చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మహీంద్రా సంస్థకు చెందిన అన్ని పెట్రోల్ కార్లు ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేయబడ్డాయని కంపెనీ స్పష్టం చేసింది. కాబట్టి పాత, కొత్త మహీంద్రా పెట్రోల్ వాహనదారులు ఎలాంటి భయం లేదా ఆందోళన లేకుండా ఈ20 పెట్రోల్‌ను వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది. ఈ ప్రకటనతో గత కొన్ని రోజులుగా కార్ల ఓనర్లలో ఉన్న ఒక రకమైన అభద్రతాభావం పూర్తిగా తొలగిపోయినట్లయింది.

ఏప్రిల్ 2025 తర్వాత వచ్చిన కార్లకు మరింత మైలేజ్

ఈ సందర్భంగా మహీంద్రా కంపెనీ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించింది. 1 ఏప్రిల్ 2025 తర్వాత మాన్యుఫ్యాక్చర్ అయిన తమ సరికొత్త పెట్రోల్ మోడళ్లను ప్రత్యేకంగా ఈ20 ఇంధనానికి తగినట్లుగా డిజైన్ చేసినట్లు పేర్కొంది. అంటే, ఈ కొత్త కార్ల ఇంజన్లు, వాటి సాఫ్ట్‌వేర్‌ను ఈ20 పెట్రోల్‌కు అనుకూలంగా క్యాలిబ్రేట్ చేశారు. దీనివల్ల ఈ వాహనాలలో ఈ20 ఇంధనాన్ని వాడినప్పుడు కారు యాక్సిలరేషన్ చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పెరిగి వాహనాలు మెరుగైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తాయని మహీంద్రా తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం, వాహన సంస్థల క్లారిటీ

మహీంద్రా కంటే ముందే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ20 పెట్రోల్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ20 ప్రమాణాల ప్రకారం తయారైన ఏ వాహన ఇంజన్‌కూ దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని ఈ కంపెనీలు తేల్చి చెప్పాయి. అయితే, పాత ఈ10 పెట్రోల్‌తో పోలిస్తే ఈ20 పెట్రోల్‌లో ఎనర్జీ కెపాసిటీ స్వల్పంగా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో వాహనాల మైలేజ్ చాలా కొద్దిగా తగ్గే అవకాశం ఉందే తప్ప, ఇంజన్ విడిభాగాలు పాడైపోవడం లేదా తుప్పు పట్టడం వంటివి జరగవని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story