Tesla : జూలైలోనే మొదటి షోరూం.. టెస్లా ఎంట్రీతో పూర్తిగా మారిపోనున్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్
టెస్లా ఎంట్రీతో పూర్తిగా మారిపోనున్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్

Tesla : ఇండియాలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఎట్టకేలకు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా జూలై నెలలో భారతదేశంలో తన మొదటి షోరూంను తెరవడానికి సిద్ధంగా ఉంది. వచ్చే నెల నుంచే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన మన ఇండియాలో టెస్లా అధికారికంగా తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. యూరప్, చైనాలలో సేల్స్ తగ్గుతున్న నేపథ్యంలో, టెస్లాకు ఇండియాలో ఎంట్రీ ఒక పెద్ద అవకాశం అవుతుందని అంటున్నారు. అయితే, ఈ కొత్త డెవలప్మెంట్ గురించి టెస్లా కంపెనీ ఇంకా అధికారికంగా ఏం చెప్పలేదు.
ముంబైలో మొదటి షోరూం.. చైనా నుంచి కార్లు!
టెస్లా కంపెనీ జూలైలో తన మొదటి షోరూంను ముంబైలో ఓపెన్ చేయబోతోంది. ఆ తర్వాత న్యూ ఢిల్లీలో కూడా ఒక షోరూం తెరవాలని ప్లాన్ చేసుకుంది. అందిన సమాచారం ప్రకారం, కంపెనీ చైనా నుంచి ఎలక్ట్రిక్ కార్లను, నెదర్లాండ్స్ నుంచి సూపర్ చార్జర్ కాంపోనెంట్లను, కార్ యాక్సెసరీస్‌ను, మర్చండైజ్, స్పేర్‌పార్ట్స్‌ను కూడా దిగుమతి చేసుకుంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల మొదటి సెట్ ఇప్పటికే మన దేశానికి చేరుకుంది. మోడల్ వై రియర్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీని టెస్లా తన చైనా ఫ్యాక్టరీ నుంచి పంపింది. టెస్లాకు ప్రపంచంలోనే ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. మొదట్లో ఇండియాలో ఇదే మోడల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
మోడీతో మీటింగ్ తర్వాతే దారి సుగమం
టెస్లా ఇండియాలో వస్తుందని చాలా ఏళ్లుగా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు అవి నిజం కాబోతున్నాయి. ఎలన్ మస్క్‌కి ఇండియా మార్కెట్ మీద చాలా కాలంగా కన్ను ఉంది. కానీ, ఇండియాలో టారిఫ్‌లు, స్థానికంగా తయారు చేయడం గురించి చాలా కాలంగా చర్చలు జరిగాయి కానీ, ఏదీ ఓ కొలిక్కి రాలేదు. ఫిబ్రవరిలో ఎలన్ మస్క్, అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాతే టెస్లా ఇండియాకు రావడానికి దారి క్లియర్ అయ్యింది. ఫిబ్రవరిలోనే టెస్లా ముంబై దగ్గరలోని ఒక పోర్ట్ కు కొన్ని వేల కార్లను పంపడానికి సిద్ధంగా ఉందని తెలిసింది.
టెస్లా మోడల్ వై ఫీచర్లు, ధర ఎలా ఉండొచ్చు?
ప్రపంచ మార్కెట్లో టెస్లా మోడల్ వై సింగిల్ మోడల్లో అమ్ముడవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఉంది. అలాగే, చాలా దూరం వెళ్లగలిగే బ్యాటరీతో వస్తుంది. ఈ కారు 526 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది. దీని స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 200 కిలోమీటర్లు.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో హీటింగ్, వెంటిలేషన్ ఉండే సీట్లు, 15 స్పీకర్లు, ఒక సబ్‌వూఫర్ సౌండ్ సిస్టమ్, వెనుక కూర్చున్న ప్రయాణికుల కోసం 8.0 అంగుళాల డిస్ప్లే, ఎనిమిది కెమెరాలు, ఇంకా చాలా యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ప్రస్తుతానికి ఇండియాలో ఈ కారు ధర ఎంత ఉంటుందో చెప్పడం కష్టం.
