Yamaha : యాక్సిడెంట్లకు ఇక కాలం చెల్లినట్లే.. ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి, గేర్లు మార్చేసే యమహా బైక్
ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి, గేర్లు మార్చేసే యమహా బైక్

Yamaha : భవిష్యత్తులో బైక్ రైడింగ్‌ను మరింత సేఫ్ అండ్ స్మార్ట్‌గా మార్చేందుకు ప్రముఖ టూ-వీలర్ దిగ్గజం యమహా నడుం బిగించింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైడ్రోజన్ బైక్‌లపై పరిశోధనలు చేస్తున్న ఈ కంపెనీ.. తాజాగా బైక్ ప్రపంచంలోనే విప్లవాత్మకమైన ఒక కొత్త టెక్నాలజీ కోసం పేటెంట్ దాఖలు చేసింది. అదే ఆటోమేటిక్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) సిస్టమ్. కార్లలో మాత్రమే చూసే ఈ లగ్జరీ ఫీచర్‌ను ఇప్పుడు బైక్‌లలోకి తీసుకువస్తూ సరికొత్త రికార్డుకు యామహా తెరలేపింది. ఈ క్రేజీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల కలిగే లాభాలేంటో వివరంగా తెలుసుకుందాం.
యమహా తెచ్చిన సరికొత్త ఏసీసీ టెక్నాలజీ
కార్లలో సాధారణంగా కనిపించే క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ.. ముందు వెళ్తున్న వాహన దూరాన్ని బట్టి స్పీడ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. కానీ, రెండు చక్రాలపై బ్యాలెన్స్ చేయడం కష్టం కాబట్టి బైక్‌లలో ఇది చాలా రిస్క్. ఈ సవాల్‌ను అధిగమిస్తూ యమహా ఒక స్మార్ట్ అల్గారిథమ్‌ను కనుగొంది. బైక్ ముందు ఏదైనా వాహనం నెమ్మదిగా వెళ్తుంటే.. బైక్‌లోని రేడార్ దాన్ని గుర్తించి, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సాయంతో థ్రోటల్‌ను దానంతట అదే తగ్గించేలా చేస్తుంది.
ఆటోమేటిక్‌గా గేర్లు, బ్రేకులు
యమహాకు చెందిన ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (Y-AMT) సిస్టమ్ ఈ టెక్నాలజీతో కలిసి ఆటోమేటిక్‌గా గేర్లను మారుస్తుంది. దీనివల్ల బైక్ ఎలాంటి జెర్క్స్ లేకుండా స్లో అవుతుంది, ఇంజన్ కూడా ఆఫ్ అవ్వదు. ఒకవేళ కేవలం గేర్లు మారిస్తే సరిపోకపోతే.. ఈ సిస్టమ్ ముందు, వెనుక బ్రేకులను కూడా స్వయంగా అప్లై చేస్తుంది. అంతేకాదు, బ్రేక్ వేసినప్పుడు బైక్ ముందు భాగం కుంగిపోకుండా ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌ను కూడా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.
ప్రీమియం బైక్‌లకు గట్టి పోటీ
ప్రస్తుతం బీఎమ్‌డబ్ల్యూ , డుకాటీ వంటి కొన్ని ప్రీమియం బైక్‌లలో ఏసీసీ ఫీచర్ ఉన్నప్పటికీ.. అత్యవసర సమయంలో రైడరే స్వయంగా బ్రేక్ వేయాల్సి ఉంటుంది. కానీ యమహా టెక్నాలజీ ఒకడుగు ముందుకేసి అవసరమైతే పూర్తి బ్రేకింగ్ బాధ్యతను కూడా తీసుకుంటుంది. ఈ ఫీచర్ గనుక ప్రొడక్షన్ బైక్‌లలోకి వస్తే రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని కంపెనీ నమ్ముతోంది.

