Yamaha : రూ.1.24 లక్షల బడ్జెట్ ధర.. ఈ-20 నుంచి ఈ-85 ఎథనాల్ ఇంధనంతో నడిచే సరికొత్త యమహా బైక్
సరికొత్త యమహా బైక్

Yamaha : భారతదేశ టూవీలర్ మార్కెట్లో పర్యావరణ హితమైన సరికొత్త ఫ్యూయెల్ టెక్నాలజీకి నాంది పలుకుతూ ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ యమహా ఒక కీలక అడుగు వేసింది. దేశంలోనే క్లీన్ ఫ్యూయల్ వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తన మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్ యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ సరికొత్త బైక్ ధరను రూ.1.24 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ పెట్రోల్‌తో పాటు ఎథనాల్ మిశ్రమం ఎక్కువగా ఉండే సరికొత్త ఇంధనాలతో కూడా ఈ బైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది.
ఈ బైక్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సాధారణ ఈ-20 పెట్రోల్ నుంచి మొదలుకొని అత్యధిక ఎథనాల్ శాతముండే ఈ-85 ఇంధనం వరకు దేనితోనైనా సజావుగా నడుస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాపులర్ ఎఫ్‌జెడ్ బైక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే దీనిని రూపొందించారు. అయితే ఎక్కువ మోతాదులో ఎథనాల్ ఉండే కెమికల్ ఫ్యూయల్‌ను తట్టుకునేలా దీని ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్‌లో కంపెనీ కొన్ని కీలకమైన సాంకేతిక మార్పులు చేసింది. భవిష్యత్తులో రాబోయే అన్ని రకాల ఇంధన ఆప్షన్లకు తగినట్లుగా ఈ బైక్ యూజర్లకు పూర్తి లబ్ధిని చేకూరుస్తుంది.
సాంకేతిక వివరాల్లోకి వెళితే.. యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ బైక్‌లో 149సీసీ సామర్థ్యం గల ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కారణంగా దీని ఇంజిన్ పవర్ అవుట్‌పుట్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ ఇంజిన్ ఇప్పుడు 11.7 హార్స్‌పవర్ (hp) శక్తిని, 12.8 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ ఎఫ్‌జెడ్ మోడళ్లతో పోలిస్తే దీని పవర్, టార్క్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్‌తో పోల్చితే ఎథనాల్ ఇంధనంలో శక్తిని ఇచ్చే ఎనర్జీ డెన్సిటీ కాస్త తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
డిజైన్ మరియు లుక్ పరంగా యమహా కస్టమర్లను నిరాశపరచకుండా రెగ్యులర్ ఎఫ్‌జెడ్ తరహా స్పోర్టీ లుక్‌నే ఇందులోనూ కంటిన్యూ చేసింది. ఇందులో అద్భుతమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్టైలిష్ ఎయిర్ వెంట్స్, లాంగ్ రైడింగ్‌కు వీలుగా ఉండే సింగిల్ పీస్ సీట్ అందించారు. భద్రత కోసం 5-స్పీడ్ గేర్‌బాక్స్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 139 కిలోలు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీగా ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌ను కేవలం మెటాలిక్ బ్లాక్ కలర్‌లో మాత్రమే విడుదల చేశారు. యమహా సంస్థ తన ప్రీమియం బ్లూ స్క్వేర్ డీలర్‌షిప్‌ల ద్వారా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ వంటి ఎంపిక చేసిన రాష్ట్రాలలో మాత్రమే దీనిని విక్రయించనుంది.

