Yamaha R15 : స్పోర్ట్స్ బైక్ కొనాలంటే జేబుకు చిల్లే.. యమహా R15 సిరీస్ ఇప్పుడు మరింత కాస్ట్లీ
యమహా R15 సిరీస్ ఇప్పుడు మరింత కాస్ట్లీ

Yamaha R15 : యువత కలల బైక్ యమహా R15 ఇప్పుడు కాస్త భారంగా మారింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా తన పాపులర్ స్పోర్ట్స్ బైక్ సిరీస్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ఖర్చు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపు అన్ని వేరియంట్లపై వర్తిస్తుంది, దీనివల్ల కనీసం రూ. 4,900 వరకు అదనపు భారం పడనుంది. మీరు ఈ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, కొత్త ధరల పట్టికను ఒకసారి చూసేయండి.
యమహా మోటార్ ఇండియా తన R15 లైనప్‌లోని అన్ని మోడళ్లపై సుమారు రూ.4,900 వరకు పెంచింది. దీనివల్ల బేస్ మోడల్ R15S ప్రారంభ ధర రూ. 1.57 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన R15 V4 ధర ఇప్పుడు రూ. 1.71 లక్షల నుంచి రూ. 1.76 లక్షల మధ్యలో ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన R15M కొనాలంటే ఇప్పుడు రూ.1.86 లక్షల నుండి రూ. 1.96 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పెంపు మే 2026 నుంచే అమల్లోకి వచ్చింది.
ధర పెరిగినప్పటికీ, బైక్ ఫీచర్లలో లేదా ఇంజిన్ సామర్థ్యంలో యమహా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే 155cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 18.4 hp పవర్‌ను, 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. పవర్‌ఫుల్ పికప్ కోసం స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ ఫీచర్ కూడా అలాగే ఉంది.
R15 V4, R15M వేరియంట్లలో అప్‌సైడ్ డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్, క్విక్ షిఫ్టర్ (కొన్ని వేరియంట్లలో) వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా R15M మోడల్‌లో లభించే కలర్ TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈ బైక్‌ను సెగ్మెంట్లోనే టాప్‌గా నిలబెడుతున్నాయి. యమహా ఫ్లాగ్‌షిప్ బైక్ R1 నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన డిజైన్ ఇప్పటికీ యువతను ఆకర్షిస్తూనే ఉంది. ధర పెరిగినా, టెక్నాలజీ, లుక్ పరంగా దీనికి సాటివచ్చే బైక్ లేదనే చెప్పాలి.

