Yamaha : భారతదేశంలోని స్పోర్ట్స్ బైక్ లవర్స్, యువ రైడర్ల కోసం ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. మార్కెట్లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న R15, ప్రీమియం బైక్ R3 మోడళ్ల మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేయడానికి యమహా సరికొత్త యమహా YZF-R2 స్పోర్ట్స్ బైక్‌ను సిద్ధం చేసింది. ఈ సరికొత్త రేసింగ్ మెషీన్ వచ్చే ఆగస్టు 2026లో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే బైక్ రైడర్లను టార్గెట్ చేస్తూ యమహా ఈ కొత్త మోడల్‌ను తీసుకువస్తోంది.

భారత్‌లోనే ఫస్ట్ గ్లోబల్ లాంచ్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యమహా కంపెనీ ఈ కొత్త YZF-R2 బైక్‌ను తమిళనాడులోని చెన్నైలో ఉన్న తమ సొంత ప్లాంట్‌లోనే మాన్యుఫ్యాక్చర్ చేయబోతోంది. ఇక్కడ తయారైన బైక్‌లను కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ బైక్ పేరుకు సంబంధించిన ట్రేడ్‌మార్క్‌ను భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, ఫిలిప్పీన్స్ వంటి అనేక దేశాలలో కంపెనీ రిజిస్టర్ చేసింది. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ బైక్ ఒక ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆగస్టు 27న గ్రాండ్ ఈవెంట్

ఇటీవలే యమహా కంపెనీ ఆగస్టు 27న జరగబోయే ఒక పెద్ద ఇన్విటేషన్ ఈవెంట్‌ను మీడియాకు పంపింది. దీనితో అదే రోజున ఈ సరికొత్త YZF-R2 బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో YZF-R2 బైక్‌తో పాటు కంపెనీ తన కొత్త NMax 155 లగ్జరీ స్కూటర్‌ను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి స్పోర్ట్స్ బైక్ ప్రియులందరి దృష్టి మాత్రం యమహా YZF-R2 పైనే కేంద్రీకృతమై ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఈ మోడల్ మొదటిసారి గ్లోబల్ లాంచ్ కాబోతోంది.

యూఎస్‌డీ ఫోర్క్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్

డిజైన్ పరంగా ఈ కొత్త యమహా YZF-R2 బైక్, కంపెనీ పాపులర్ మోడల్ R15 V4 ప్రేరణతో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. బైక్ హై-స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు కూడా రోడ్డుపై మంచి గ్రిప్, పటిష్టమైన కంట్రోల్ ఉండేలా దీని ఫ్రేమ్‌ను చాలా బలంగా డిజైన్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో గోల్డెన్ కలర్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు, వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు భద్రత కోసం అడ్వాన్స్‌డ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌ను అమర్చారు. దీనివల్ల బైక్ అకస్మాత్తుగా బ్రేక్ వేసినా స్కిడ్ అవ్వకుండా సేఫ్‌గా ఆగిపోతుంది.

కార్లను తలపించే రేసింగ్ టెక్నాలజీ

ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది. ఇంజన్ తక్కువ స్పీడ్‌లో ఉన్నా, ఎక్కువ స్పీడ్‌లో ఉన్నా ఒకే రకమైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఇందులో వివిఏ టెక్నాలజీని ఉపయోగించారు. రేసింగ్ ట్రాక్‌లపై బైక్‌ను సులభంగా కంట్రోల్ చేయడానికి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్, క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకునే వీలు కల్పించే క్విక్ షిఫ్టర్, గేర్ల షిఫ్టింగ్‌ను స్మూత్‌గా మార్చే అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి హై-ఎండ్ ఫీచర్లను జోడించారు. అదనపు సేఫ్టీ కోసం లావుపాటి వెనుక టైర్, సైడ్ స్టాండ్ వేసి ఉంటే బైక్ స్టార్ట్ కాకుండా ఉండే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్‌ను కూడా అమర్చారు.

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, యమహా YZF-R2 నేరుగా ఈ సెగ్మెంట్లో రారాజుగా వెలుగుతున్న కేటీఎమ్ ఆర్‌సి 200 వంటి పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ బడ్జెట్లోనే లగ్జరీ లుక్, అద్భుతమైన మైలేజ్, పవర్‌ఫుల్ టాప్ స్పీడ్, ఆధునిక సాంకేతికతను కోరుకునే యువతను ఆకట్టుకోవడానికి యమహా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో యమహా తీసుకురాబోతున్న ఈ విప్లవాత్మక మార్పు మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story