GST తగ్గింపుతో భారీగా తగ్గిన ధరలు

Yezdi Bikes : జావా, యెజ్డీ బైక్‌లను తయారు చేసే క్లాసిక్ లెజెండ్స్ కంపెనీకి ఈ పండుగ సీజన్ భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. జీఎస్టీ 2.0 వల్ల బైకుల ధరలు తగ్గడం, కొత్త మోడళ్లను విడుదల చేయడంతో తమ బైక్‌ల బుకింగ్‌లు అనూహ్యంగా పెరిగాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా రాజస్థాన్‌లో బుకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు పెరిగాయని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజా తెలిపారు. 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై జీఎస్టీలో కోత విధించడం ఈ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణం. కొత్తగా విడుదలైన రోడ్‌స్టర్, అడ్వెంచర్ బైక్‌ల కొత్త వెర్షన్లు కూడా పండుగ సీజన్‌లో డిమాండ్‌ను పెంచాయి. అనుపమ్ థరేజా శుక్రవారం జైపూర్‌లో జరిగిన జావా యెజ్డీ రైడర్ క్లబ్ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. అంతేకాకుండా గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్‌లో క్లాసిక్ బైక్‌ల అమ్మకాలకు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు జావా, యెజ్డీ బైక్‌లు అమెజాన్ వెబ్‌సైట్‌లో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత యెజ్డీ రోడ్‌స్టర్, అడ్వెంచర్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.16,000 నుంచి రూ.17,000 వరకు తగ్గాయి. యెజ్డీ రోడ్‌స్టర్ పాత ధర రూ.2,09,969, యెజ్డీ రోడ్‌స్టర్ కొత్త ధర రూ.1,93,565, యెజ్డీ అడ్వెంచర్ పాత ధర రూ.2,14,900, యెజ్డీ అడ్వెంచర్ కొత్త ధర రూ.1,98,111.

ఈ గణనీయమైన ధర తగ్గింపు యెజ్డీ బైకుల డిమాండ్‌ను భారీగా పెంచింది.

కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ బైక్‌లో అప్‌డేట్ చేసిన ఆల్ఫా 2 ఇంజిన్‎ను అమర్చారు. 334 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, 29.6 బీహెచ్‌పీ పవర్, 29.9 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్‌ను జత చేశారు. ఈ కొత్త యెజ్డీ రోడ్‌స్టర్‌ను పొడవైన ప్రయాణాల కోసం లేటెస్ట్ క్లాసిక్ బైక్‌గా మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఇందులో 50కి పైగా కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ రాజస్థాన్‌లోని 11 నగరాల్లో 14 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ఇది కంపెనీ జాతీయ రిటైల్ నెట్‌వర్క్‌లో దాదాపు ఐదు శాతం. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story