రూ.15,000 కోట్ల అప్పును గ్రాంటుగా మార్చనున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గుడ్ న్యూస్ అందించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి మరింత ఊతం ఇచ్చేలా నిర్ణయం ప్రకటించింది. అసలే అప్పుల భారంలో ఉన్న రాష్ట్రానికి ఉపశమనం కలిగించే శుభవార్త చెప్పింది. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ లాంటి సంస్థల ద్వారా తీసుకున్న రూ.15,000 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా మార్చేందుకు సిద్ధమైంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఊరట కానుంది. ఈ రుణం ‘ఎక్స్టర్‌నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల’ కింద రాష్ట్ర అప్పుగా నమోదు కాకపోవడం వల్ల ఇది తుది నిర్ణయంగా తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ భారం, తిరిగి చెల్లింపుల బాధ్యత తగ్గి, మొత్తం అప్పు భారం కొంతవరకు తగ్గుతుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తం అంచనా వ్యయం రూ.71,000 కోట్లు కాగా, ఇప్పటికే రూ.58,000 కోట్ల విలువైన టెండర్లు జారీ అయ్యాయి. ఈ గ్రాంటు ద్వారా రాష్ట్ర ఆర్థిక ఒత్తిడిని కొంతవరకు తగ్గించవచ్చు. 2025–26లో వడ్డీ చెల్లింపుల ఖర్చు రూ.34,998 కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు.

ఈ రుణాన్ని గ్రాంటుగా మార్చితే, రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక లోటు తగ్గించడం కోసం ప్రభుత్వానికి అదనపు రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో రాష్ట్ర ఆర్థిక లోటు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 4.4 శాతంగా అంచనా వేశారు. కేంద్ర నిర్ణయం రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నట్లు అవుతుంది.

గత ఏడాది జులైలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, “అమరావతి అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లు అందిస్తామని, భవిష్యత్‌లో మరింత సహాయం చేస్తామని” ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రాజధానికి రూ.15,000 కోట్ల రుణానికి అంగీకారం వచ్చిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం మరింత ఊతం అందించినట్లేనని భావించవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ఇతర రుణాల విషయంలోనూ సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Politent News Web3

Politent News Web3

Next Story