TDP Vs YSRCP: ఏపీలో రాజకీయ వేడి–కౌన్సిల్‌లో ఆందోళనలు, కూటమిలో అసంతృప్తి
విశాఖ జివిఎంసీ సమావేశంలో వైసీపీ నిరసనలు…
ఏపీ రాజకీయ వేదికపై శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలోని జివిఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు గురిచేశాయి.
కౌన్సిల్‌లో వైసీపీ నిరసనలు…సభలో గందరగోళం
విశాఖపట్నం జివిఎంసీ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్త వాతావరణంలో ప్రారంభమైంది. విశాఖ ఎంపీ భరత్‌కు చెందిన గీతం విద్యాసంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను అజెండాలో చేర్చడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి మేయర్ పోడియంను చుట్టుముట్టిన వారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంశాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఇదే సమయంలో కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం మరో వివాదానికి దారితీసింది. మీడియాను లోపలికి అనుమతించాలని వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. మీడియా లేకుండా సమావేశాలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. ఎంపీకి ప్రజలు ఓట్లు వేసింది భూములు దోచుకోవడానికా అని ప్రశ్నించారు. గేట్ల వద్ద పోలీసులు, వామపక్ష కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

