రికార్డు స్థాయిలో ధర

Balapur Ganesh Laddu: భాగ్యనగరంలో బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం (Balapur Laddu Auction) ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ లడ్డూను సొంతం చేసుకోవడానికి భక్తులు ఎంతో ఉత్సాహంతో పోటీపడతారు. ఈ ఏడాది కూడా లడ్డూ వేలం ఎంతో ఉత్కంఠగా జరిగింది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షల రికార్డు ధరకు వేలం వేయబడింది.

కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది ఈ లడ్డూ రూ.30.01 లక్షలకు బాలాపూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం గత ఏడాది కంటే రూ.4.99 లక్షలు అధిక ధర పలికింది. గత ఆరేళ్లుగా ఈ లడ్డూను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నానని, ఈ సారి స్వామివారి కృపతో అది సాధ్యమైందని లింగాల దశరథ గౌడ్ తెలిపారు.

లడ్డూ వేలం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేలం సజావుగా జరిగేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలం అనంతరం బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర హుస్సేన్‌సాగర్ వైపు కొనసాగనుంది. ఈ శోభాయాత్ర బాలాపూర్ నుంచి 16 కిలోమీటర్ల మేర చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా సాగనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story