Insurance FDI : బీమా రంగంలో విప్లవం.. 100% విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
100% విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Insurance FDI : భారతదేశ ఇన్సూరెన్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీయ బీమా మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులను వెల్లువలా రప్పించేందుకు 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి రావడమే కాకుండా, విదేశీ కంపెనీలు భారత గడ్డపై నేరుగా వ్యాపారం చేసేందుకు మార్గం సుగమమైంది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తూ కొన్ని ప్రత్యేక నిబంధనలను విధించింది.
100 శాతం ఎఫ్‌డీఐ అంటే ఏమిటి?
ఇప్పటివరకు ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ కంపెనీలు 74 శాతం వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. అంటే భారతీయ భాగస్వామి ఖచ్చితంగా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం పెట్టుబడికి అనుమతి ఇవ్వడంతో విదేశీ కంపెనీలు స్వతంత్రంగా భారత్‌లో అడుగుపెట్టవచ్చు. మార్కెట్లోకి కొత్త కంపెనీలు రావడం వల్ల వాటి మధ్య పోటీ పెరుగుతుంది. ఫలితంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు పాలసీ ప్రీమియం ధరలను తగ్గించే అవకాశం ఉంది. సామాన్యులకు తక్కువ ధరకే ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది.
ఎల్ఐసీ విషయంలో ప్రత్యేక నిబంధనలు
ప్రైవేట్ కంపెనీలకు 100 శాతం అవకాశం ఇచ్చినా, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ అయిన ఎల్ఐసీకి మాత్రం పరిమితులు విధించారు. ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడుల పరిమితిని కేవలం 20 శాతానికి మాత్రమే పరిమితం చేశారు. ఎందుకంటే ఎల్ఐసీ అనేది 1956 ప్రత్యేక చట్టం కింద నడుస్తోంది. కోట్ల మంది భారతీయుల నమ్మకం ఈ సంస్థతో ముడిపడి ఉన్నందున, ఇందులో విదేశీయుల జోక్యం అతిగా ఉండకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బ్రోకరేజ్ సంస్థలకు మాత్రం 100 శాతం అవకాశం ఉంటుంది.
పొరుగు దేశాల పెట్టుబడులపై నిఘా
చైనా, హాంకాంగ్ వంటి పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలించినా, నిఘాను మాత్రం కట్టుదిట్టం చేసింది. ఏవైనా విదేశీ కంపెనీల్లో మన సరిహద్దు దేశాల వాటా 10 శాతం కంటే తక్కువ ఉంటే అవి ఆటోమేటిక్ రూట్ లో భారత్ లోకి రావచ్చు. అయితే ఆ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు యజమాని ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. నేరుగా సరిహద్దు దేశాల్లో నమోదైన కంపెనీలకు మాత్రం ప్రభుత్వం నుండి అనుమతి తప్పనిసరి.
ఐఆర్‌డీఏఐ (IRDAI) కంట్రోల్ ఉంటుంది:
విదేశీ పెట్టుబడులు 100 శాతం వచ్చినా, ఆ కంపెనీలు ఇక్కడ తమ ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదు. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) నిబంధనలకు ఆ కంపెనీలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. లైసెన్సింగ్ నుండి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు ప్రతి విషయంలోనూ ఐఆర్‌డీఏఐ పర్యవేక్షణ ఉంటుంది. ఇన్సూరెన్స్ చట్టం 1938 ప్రకారం కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా ఈ కంపెనీలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో భారత బీమా మార్కెట్ ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

