ఇప్పుడు న్యూయార్క్ వేలంలో

Gold Toilet: సాధారణంగా టాయిలెట్ సీట్ అంటే ఇంట్లో ఒక ముఖ్యమైన వస్తువు. కానీ అది ఒక విలాసవంతమైన బంగళా లేదా ఒక ప్రైవేట్ జెట్ కంటే ఎక్కువ ధర ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? ఇది అబద్ధం కాదు, అక్షరాలా నిజం! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్ ఇప్పుడు వేలం పాట కోసం సిద్ధమైంది. ఇది మామూలు సీటు కాదు, ఏకంగా 100 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ఒక అద్భుతమైన కళాఖండం. దీని ధర వింటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

ఈ విలువైన టాయిలెట్‌కి పెట్టిన పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. దీని పేరు అమెరికా. ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరిజియో క్యాటెలాన్ దీన్ని తయారుచేశారు. ఈ గోల్డెన్ టాయిలెట్ మొత్తం 18 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారైంది. దీని మొత్తం బరువు దాదాపు 101.2 కిలోలు (223 పౌండ్లు). ఈ కళాఖండం ప్రారంభ ధర 10 మిలియన్ డాలర్లు, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 88 కోట్లకు పైనే. నవంబర్ 8న ప్రారంభమైన ఈ వేలంలో దీనిని కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు పోటీ పడుతున్నారు.

సాధారణంగా కళాఖండాలు కేవలం చూసి ఆనందించడానికి, అలంకరణ కోసం మాత్రమే ఉంటాయి. కానీ ఈ అమెరికా టాయిలెట్ అలా కాదు. ఇది బంగారంతో తయారు చేసినప్పటికీ ఒక మామూలు టాయిలెట్‌లాగా పనిచేస్తుంది. అంటే, దీనిని ఎవరైనా ఉపయోగించవచ్చు. దీనిని వేలం వేస్తున్న ప్రముఖ సంస్థ సోథెబీస్ ఈ టాయిలెట్‌ను కేవలం విలాస వస్తువుగా కాకుండా కళకు, వస్తువుకు మధ్య ఉన్న తేడాగా అభివర్ణించింది. ఈ కళాకారుడు సమాజంలో ధనం విలువ, వనరుల పంపిణీపై ఉన్న అంతరాన్ని ప్రశ్నించే వ్యంగ్య రూపంగా దీనిని రూపొందించారు.

ఈ టాయిలెట్‌కి ఇంతటి గుర్తింపు రావడానికి కేవలం దాని ధర మాత్రమే కారణం కాదు. దీని చరిత్ర కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇదే తరహా టాయిలెట్ 2019లో ఇంగ్లాండ్‌లోని ప్రముఖ ప్యాలెస్ అయిన బ్లెన్హైమ్ ప్యాలెస్ నుంచి దొంగతనానికి గురైంది. పనిచేసే ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు అప్పట్లో ఊడబీకి తీసుకెళ్లారు. ఆ చోరీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు దొంగిలించబడిన దాని మాదిరిగానే ఉన్న ఈ టాయిలెట్ న్యూయార్క్‌లో వేలానికి రావడంతో ప్రజల్లో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story