అమెరికాలో సినిమా తీయకపోతే 100% సుంకమే

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ట్యారిఫ్ విధానాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన అమెరికా వెలుపల నిర్మించిన ఏ సినిమాపైనైనా 100 శాతం సుంకం విధిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, అమెరికాలో తయారవని ఫర్నిచర్‌పై కూడా గణనీయమైన సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌ల ద్వారా ఈ కొత్త ట్యారిఫ్ విధానాలను వెల్లడించారు.

ట్రంప్ తన పోస్ట్‌లో.."అమెరికా సినిమా బిజినెస్ ఇతర దేశాలు చాలా ఈజీగా దొంగిలిస్తున్నాయి. ఇది కాలిఫోర్నియాకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. చాలా కాలంగా పరిష్కారం కాని ఈ సమస్యకు నేను ఒక పరిష్కారం కనుగొన్నాను. అమెరికా వెలుపల నిర్మించిన ఏ సినిమాపైనైనా 100 శాతం సుంకం విధిస్తున్నాను" అని స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ నిర్ణయం హాలీవుడ్ సినిమాలకు కూడా వర్తిస్తుందా, అంటే విదేశాల్లో షూటింగ్ చేసిన అమెరికన్ సినిమాలపైనా ఈ సుంకం ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లడం తగ్గింది, దీంతో బాక్సాఫీస్ వసూళ్లు తగ్గాయి. చాలా మంది థియేటర్లకు వెళ్లకుండా OTT ప్లాట్‌ఫారమ్‌లు, టీవీల్లో సినిమాలు చూడటానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ వల్ల కాలిఫోర్నియాలోని హాలోవుడ్ సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ట్రంప్ ఈ నిర్ణయంతో అమెరికన్ సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించి, స్థానిక ఉద్యోగాలను సృష్టించాలని చూస్తున్నారు.

సినిమాలతో పాటు, అమెరికాలో తయారుకాని ఫర్నిచర్ పై కూడా భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీనికి కారణం, అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఫర్నిచర్ పరిశ్రమ గతంలో చాలా బలంగా ఉండేది. ఇది ప్రపంచ ఫర్నిచర్ రాజధానిగా పేరుగాంచింది. సెంచరీ ఫర్నిచర్, ఈజే విక్టర్, ఆష్లీ ఫర్నిచర్, బెర్న్‌హార్ట్ వంటి ప్రముఖ ఫర్నిచర్ తయారీ సంస్థలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ సుంకాల ద్వారా దేశీయ ఫర్నిచర్ ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రంప్ ఈ నిర్ణయాలు కేవలం ప్రకటనలకే పరిమితమా లేక నిజంగా అమలు చేస్తారా, ఒకవేళ అమలు చేస్తే ప్రపంచ సినిమా, ఫర్నిచర్ పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story