Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజనకు 11 ఏళ్లు..4.5 కోట్లకు పైగా ఖాతాలతో సరికొత్త రికార్డు
4.5 కోట్లకు పైగా ఖాతాలతో సరికొత్త రికార్డు

Sukanya Samriddhi Yojana : ప్రతి ఇంట్లో మహాలక్ష్మిలా పుట్టిన ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం ప్రారంభమై నిన్నటితో (జనవరి 22, 2026) విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2015లో బేటీ బచావో.. బేటీ పడావో అభియాన్‌లో భాగంగా ప్రధాని మోదీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ 11 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 4.53 కోట్లకు పైగా ఖాతాలు తెరిచి, ఆడపిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు భరోసా పొందుతున్నారు. ఈ పథకం ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన అత్యంత ప్రజాదరణ పొందింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం అందిస్తున్న భారీ వడ్డీ రేటు. ప్రస్తుతం ఈ పథకంపై వార్షికంగా 8.2 శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది. గత 11 ఏళ్లలో ఈ పథకంలో జమ అయిన మొత్తం అక్షరాలా రూ.3.33 లక్షల కోట్లు అంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎప్పుడైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఒకవేళ కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి జన్మిస్తే మాత్రం ముగ్గురికి ఈ ఖాతా తీసుకునే వెసులుబాటు ఉంది.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. ఏడాదికి కనీసం రూ.250 జమ చేస్తే సరిపోతుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. మీరు ఖాతా తెరిచిన నాటి నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21 ఏళ్లు నిండినప్పుడు ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. అంటే మీ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేసరికి ఒక భారీ మొత్తం చేతికి అందుతుంది. దీనివల్ల ఆమె ఉన్నత చదువులకు లేదా వివాహ వేడుకలకు ఎవరి దగ్గరా చేయి చాచాల్సిన అవసరం ఉండదు. మెచ్యూరిటీ కంటే ముందే డబ్బులు కావాలనుకుంటే, అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత సగం మొత్తాన్ని (50 శాతం) విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, ఇది ఆదాయపు పన్ను ఆదా చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. సెక్షన్ 80సి కింద మీరు పెట్టిన పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో వచ్చే వడ్డీపై కానీ, అసలుపై కానీ ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ట్రిపుల్ ఎగ్జెంప్షన్ (EEE) పథకం అంటారు. అంటే పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ అమౌంట్.. మూడింటికీ పన్ను ఉండదు. అందుకే రిస్క్ లేని మరియు ఎక్కువ లాభం ఇచ్చే పథకం కోసం చూసే తల్లిదండ్రులకు ఇది మొదటి ఎంపికగా మారింది.
ఈ ఖాతాను మీరు ఏదైనా పోస్టాఫీసులో లేదా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో సులభంగా తెరవవచ్చు. దీని కోసం ఆడపిల్ల పుట్టిన సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, ఫోటోలు ఉంటే సరిపోతుంది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులే ఈ ఖాతాను నిర్వహిస్తారు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఆ అమ్మాయే స్వయంగా తన ఖాతాను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ 11 ఏళ్లలో కోట్ల మంది ఆడపిల్లల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపిన ఈ పథకం, భవిష్యత్తులో మరింత మందికి చేరువ కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మీరు ఇంకా మీ అమ్మాయి పేరు మీద ఈ ఖాతా తెరవకపోతే, వెంటనే సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించండి.

