IBM Employee : 15 ఏళ్లుగా సెలవులోనే..పని చేయకుండానే రూ.54 లక్షల జీతం..అయినా కంపెనీపై కేసు వేసిన ఉద్యోగి
అయినా కంపెనీపై కేసు వేసిన ఉద్యోగి

IBM Employee : ప్రపంచంలోనే అత్యంత వింతైన ఉద్యోగి కథ ఇది. అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తి ఏకంగా 15 ఏళ్లుగా ఆఫీస్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. పని చేయకపోయినా కంపెనీ అతనికి ప్రతి ఏటా లక్షలాది రూపాయల జీతం చెల్లిస్తోంది. అయితే ఆ జీతం చాలదంటూ, తనకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదని సదరు ఉద్యోగి ఏకంగా కంపెనీపైనే కోర్టులో కేసు వేశాడు. బ్రిటన్‌కు చెందిన ఐబీఎం కంపెనీలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రిటన్‌కు చెందిన ఇయాన్ క్లిఫోర్డ్ అనే వ్యక్తి ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. 2008 సెప్టెంబర్‌లో మానసిక అనారోగ్యం కారణంగా ఆయన మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే సుమారు 15 ఏళ్లుగా ఆయన ఆఫీస్‌కు వెళ్లలేదు. సాధారణంగా ఏ కంపెనీ అయినా కొన్ని నెలల తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తుంది. కానీ ఐబీఎం సంస్థ అతనికి ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. 2013లో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం.. ఇయాన్ క్లిఫోర్డ్‌కు 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, అంటే రిటైర్మెంట్ వరకు అతని చివరి జీతంలో 75 శాతం మొత్తాన్ని కంపెనీ ప్రతి ఏటా చెల్లిస్తూనే ఉండాలి.
ఈ ఒప్పందం ప్రకారం ఇయాన్ క్లిఫోర్డ్‌కు ఏటా సుమారు 54,000 పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.54 లక్షలు) జీతంగా అందుతోంది. పని చేయకుండానే ఇంత భారీ మొత్తం అందుతున్నా, ఆయన సంతృప్తి చెందలేదు. గత 10 ఏళ్లుగా తనకు ఒక్క రూపాయి కూడా ఇంక్రిమెంట్ ఇవ్వలేదని, ద్రవ్యోల్బణం కారణంగా వస్తువుల ధరలు పెరిగిపోయాయని, తన జీతం కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేశాడు. ఇది వికలాంగుల పట్ల వివక్ష చూపడమేనని తన వాదనను వినిపించాడు.
ఈ కేసును విచారించిన బ్రిటన్ కోర్టు సదరు ఉద్యోగికి గట్టి షాక్ ఇచ్చింది. "పని చేసే సాధారణ ఉద్యోగులకు కూడా లేని అద్భుతమైన సౌకర్యాన్ని కంపెనీ మీకు కల్పించింది. పని చేయకుండానే ఏటా రూ.54 లక్షలు పొందడం అనేది ఒక గొప్ప ప్రయోజనం. దీనికి మించి ఇంకా కావాలని కోరడం అన్యాయం" అని పేర్కొంటూ జడ్జి ఆ కేసును కొట్టివేశారు. పని చేయకుండానే కోట్ల రూపాయలు పొందుతూ, ఇంకా కావాలని కోర్టుకు వెళ్లిన ఈ ఉద్యోగి తీరు చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మన దేశంలో ఐటీ ఉద్యోగులు ఏటా 5-10 శాతం ఇంక్రిమెంట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతుంటే, ఈయన మాత్రం ఏకంగా 15 ఏళ్లు సెలవులో ఉండి జీతం పెంచమనడం నిజంగా విడ్డూరమే.

