Scam : 20 నిమిషాల్లో క్రెడిట్ కార్డు నుంచి రూ.8.8 లక్షలు మాయం..ఈ 4 తప్పులే కారణం!
ఈ 4 తప్పులే కారణం!

Scam : కోల్‌కతాలోని సరసునాకు చెందిన పంకజ్ కుమార్‌కు తాను సేఫ్‌గా ఉన్నానని అనుకున్నాడు. ఆయన దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉన్నా, అనుమానాస్పద లావాదేవీలు లేవు. కానీ కేవలం 20 నిమిషాల్లో ఆయన ఖాతా నుంచి రూ.8.8 లక్షలు మాయమయ్యాయి. అది కూడా ఆయన అనుమతి లేకుండా ఆన్‌లైన్ కొనుగోళ్ల ద్వారా జరిగింది. వరుసగా ఓటీపీలు రావడం గమనించి తన కార్డులను బ్లాక్ చేయించేలోపే, సైబర్ నేరగాళ్లు తమ పని పూర్తి చేశారు. పోలీసుల అనుమానం ప్రకారం, ఇది సిమ్-స్వాప్ స్కామ్ లేదా ఎవరైనా ఆయన వ్యక్తిగత డేటాను దొంగిలించి, పెద్ద ఈ-కామర్స్ సైట్‌లో ఇంత త్వరగా భారీ మొత్తంలో కొనుగోళ్లు చేసి ఉండవచ్చు. ఈ కేసులో కార్తిక్ సాబ్లే అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలు మొబైల్ ఆధారిత ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయని చూపిస్తున్నాయి. కోల్‌కతా పోలీసులు ప్రకారం, ఇలాంటి మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో నకిలీ కస్టమర్ సపోర్ట్ కాల్స్, అంతర్గత ఉద్యోగుల సహకారం కూడా ఉంటోంది. ఈ రకమైన స్కామ్ నుంచి మీరు తప్పించుకోవాలంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సిమ్-స్వాప్ స్కామ్ అంటే ఏంటి?
సైబర్ నేరగాళ్లు మీ సిమ్‌ను స్వాప్ చేసినప్పుడు, వారు మీ మొబైల్ నంబర్‌ను తమ సిమ్‌కు మార్చుకుంటారు. ఇందుకోసం వారు మీలా నటించి మొబైల్ కంపెనీని మోసగిస్తారు. ఒకసారి మీ నంబర్ వారి చేతికి చిక్కితే, వారు మీ ఓటీపీ, బ్యాంకింగ్ అలర్ట్‌లు, పాస్‌వర్డ్‌లను కూడా మార్చగలరు. దీంతో మీ ఖాతాలో ఉన్న డబ్బును సులభంగా దోచుకుంటారు.
క్రెడిట్ కార్డ్, సిమ్-స్వాప్ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి?
ఓటీపీ, సీవీవీ, పిన్ ఎవరికీ చెప్పవద్దు: బ్యాంకులు ఎప్పుడూ కాల్స్, ఎస్ఎంఎస్, లేదా ఈమెయిల్ ద్వారా మీ ఓటీపీ లేదా పాస్‌వర్డ్‌ను అడగవు. ఎవరైనా అడిగితే, వెంటనే కాల్ కట్ చేయండి. మీ కార్డ్ వెనుక ఉన్న నంబర్‌కు నేరుగా కాల్ చేసి కన్ఫాం చేయండి.
సిమ్-స్వాప్ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు: మీ ఫోన్ నెట్‌వర్క్ అకస్మాత్తుగా పోయినా లేదా సిమ్ డీయాక్టివేట్ అయినట్లు చూపించినా వెంటనే మీ ఆపరేటర్‌ను సంప్రదించండి. పోర్టింగ్ లాక్ లేదా సిమ్ పిన్ వంటి ఫీచర్‌లను యాక్టివేట్ చేసుకోవాలి.
చిన్న లావాదేవీలను తేలిగ్గా తీసుకోవద్దు: నేరగాళ్లు మొదట చిన్న మొత్తంలో లావాదేవీ చేసి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో దోచుకుంటారు. ఏ చిన్న అనుమానాస్పద లావాదేవీ జరిగినా వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.
వర్చువల్ లేదా తక్కువ లిమిట్ ఉన్న కార్డ్ వాడాలి: ఆన్‌లైన్ చెల్లింపుల కోసం తక్కువ లిమిట్ ఉన్న వర్చువల్ లేదా సెకండరీ కార్డ్‌ను వాడండి. ఇలా చేస్తే డేటా లీక్ అయినా పెద్దగా నష్టం ఉండదు.
మీ ఫోన్, యాప్స్‌ను సురక్షితంగా ఉంచుకోండి: కార్డ్ వివరాలను ఫోన్ నోట్స్‌లో నేరుగా సేవ్ చేయవద్దు. యాంటీవైరస్, పాస్‌వర్డ్ మేనేజర్, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటివి వాడండి.
ఫేక్ బ్యాంక్, ప్రభుత్వ కాల్స్‌కు దూరంగా ఉండండి: ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఆస్పత్రి ఉద్యోగి, బీఎస్ఎఫ్ ఆఫీసర్, లేదా కస్టమర్ కేర్ ప్రతినిధిగా నటిస్తూ కాల్స్ చేస్తారు. కాబట్టి కాలర్ ఐడీని నమ్మవద్దు. అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ నుంచి మాత్రమే వివరాలు సేకరించుకోవాలి.
మోసం జరగగానే వెంటనే ఫిర్యాదు చేయాలి: సమయమే డబ్బు. మోసం జరిగిన వెంటనే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. అలాగే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. మీరు ఎంత త్వరగా స్పందిస్తే, నష్టం భర్తీ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
ఈ స్కామ్‌లు ఎలా సక్సెస్ అవుతున్నాయి?
కేవలం డబ్బులు కొట్టేయడమే కాదు, అంతకుముందు మీ డేటాను దొంగిలించడం కూడా ఇందులో ఒక భాగం. సిమ్-స్వాప్ ద్వారా నేరగాళ్లు ఓటీపీని మీరు లేదా బ్యాంకు గమనించకముందే చేజిక్కించుకుంటారు. ఇందులో సోషల్ ఇంజినీరింగ్ లేదా ఇంటర్నల్ సహాయం ఉంటే, మీ భద్రత క్షణాల్లోనే ప్రశ్నార్థకంగా మారుతుంది.
