474% పెరిగిన ఇన్ కమ్ ట్యాక్స్ రిఫండ్స్

Income Tax Refunds : గత 11 సంవత్సరాల్లో ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్స్ లో భారీగా 474% పెరుగుదల నమోదైంది. ఇది పన్నుల వ్యవస్థలో వచ్చిన మార్పులు, డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరగడానికి నిదర్శనం. ఆర్థిక సంవత్సరం 2013-14లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.83,008 కోట్ల రిఫండ్లను జారీ చేయగా, 2024-25లో అది రూ.4.77 లక్షల కోట్లకు చేరింది. ఈ కాలంలో రిఫండ్ ప్రక్రియకు పట్టే సమయం కూడా 93 రోజుల నుంచి కేవలం 17 రోజులకు తగ్గింది. ఇది 81% తగ్గింపును సూచిస్తుంది.

ఆన్‌లైన్ రిటర్న్ ఫైలింగ్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ప్రి-ఫిల్డ్ రిటర్న్స్, ఆటోమేటెడ్ రిఫండ్ ప్రాసెసింగ్, రియల్-టైమ్ టీడీఎస్ సర్దుబాటు, ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి చర్యలు రిఫండ్ ప్రక్రియను వేగవంతం, కచ్చితం, పన్ను చెల్లింపుదారులకు సౌకర్యవంతంగా చేశాయి. ఈ మార్పులు ప్రక్రియను పారదర్శకంగా మార్చడమే కాకుండా, పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని కూడా మెరుగుపరిచాయి. తద్వారా సిస్టమ్ పై వారి విశ్వాసం పెరిగింది.

గత 11 సంవత్సరాల్లో మొత్తం డైరెక్ట్ టాక్స్ వసూళ్లు కూడా 274% పెరిగాయి. ఇది రూ.7.22 లక్షల కోట్ల నుంచి రూ.27.03 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేసే వారి సంఖ్య 133% పెరిగింది. 2013లో 3.8 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేయగా, 2024లో ఈ సంఖ్య 8.89 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడాన్ని, ట్యాక్స్ సిస్టమ్ లో ఎక్కువ మంది పాల్గొనడాన్ని సూచిస్తుంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డైరెక్ట్ టాక్స్ వసూళ్లలో 17.6% వాటాను రిఫండ్ రూపంలో తిరిగి ఇచ్చారు. ఇది 2013-14లో 11.5% గా ఉండేది. రిఫండ్ నిష్పత్తిలో ఈ పెరుగుదల పన్ను వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని, బలమైన టీడీఎస్, అడ్వాన్స్ టాక్స్ విధానాలను సూచిస్తుంది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరగడంతో, రిఫండ్ల మొత్తం, వాటి పంపిణీ కూడా నిరంతరం పెరుగుతోంది. ఇది భారతీయ పన్ను వ్యవస్థ కెపాసిటీ చూపుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story