48 గంటల్లోనే రూ.52 వేల కోట్లు ఖర్చు

US Iran War : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఊహించని స్థాయికి చేరుకుంది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఇరాన్ మీద సైనిక చర్య ప్రారంభించిన కేవలం మొదటి 48 గంటల్లోనే అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఏకంగా 5.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52 వేల కోట్లు) విలువైన ఆయుధాలను ఖర్చు చేసింది. యుద్ధం ఇంత వేగంగా నిధులను, ఆయుధ సంపత్తిని కరిగించేస్తుండటంతో అమెరికా అధికారుల్లో ఆందోళన మొదలైంది. తమ వద్ద ఉన్న అత్యుత్తమ ఆయుధ నిల్వలు నిండుకుంటున్నాయని, ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగించాలంటే అదనంగా 10 బిలియన్ డాలర్ల డిఫెన్స్ బడ్జెట్ అవసరమని వైట్ హౌస్ భావిస్తోంది.

హోర్ముజ్ జలసంధిపై ఉక్కుపాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో చమురు సరఫరాను అడ్డుకోవాలని చూస్తే ఇరాన్ కోలుకోలేని దెబ్బ తింటుందని హెచ్చరించారు. "ఒకవేళ ఇరాన్ గనుక చమురు రవాణాను ఆపాలని చూస్తే, ఇప్పటివరకు జరిగిన దాడుల కంటే 20 రెట్లు శక్తివంతమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ దాడుల నుంచి ఇరాన్ ఒక దేశంగా కోలుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది" అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయని, చావు తప్పదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

లేజర్ గైడెడ్ బాంబుల ప్రయోగం

ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు అత్యంత ఖరీదైన లేజర్ గైడెడ్ బాంబులను భారీగా ఉపయోగిస్తున్నాయి. ఇవి లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదిస్తాయి కానీ, వీటి తయారీకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. కేవలం రెండు రోజుల్లోనే 52 వేల కోట్లు ఖర్చు అవ్వడంతో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. అయితే పంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ మాత్రం.. అమెరికా దగ్గర ఎలాంటి మిషన్ అయినా పూర్తి చేయడానికి కావాల్సిన ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయని, అధ్యక్షుడు కోరుకున్న సమయంలో ఎక్కడైనా దాడులు చేసే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలకు అమెరికా గిఫ్ట్

ఈ యుద్ధాన్ని అమెరికా కేవలం ఇరాన్‌తో పోరాటంగా చూడటం లేదు. ఇంటర్నేషనల్ బిజినెస్, గ్లోబల్ ఎకానమీని కాపాడే చర్యగా ట్రంప్ అభివర్ణించారు. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడం ద్వారా చైనా వంటి దేశాలకు కూడా తాము మేలు చేస్తున్నామని, ఇది అమెరికా ప్రపంచ దేశాలకు ఇస్తున్న గిఫ్ట్ అని ఆయన పేర్కొన్నారు. తమ చర్యల వల్ల అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగుతుందని, దీనిని ప్రపంచ దేశాలు అభినందిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ యుద్ధం ఒక కీలక మలుపులో ఉందని, శాంతి కలగాలని కోరుకుంటున్నా దాడులకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story