Property Purchase : మోసపోకుండా ఉండాలంటే..ఇల్లు కొనే ముందు ఈ 6 పేపర్లు కచ్చితంగా చెక్ చేయండి
ఇల్లు కొనే ముందు ఈ 6 పేపర్లు కచ్చితంగా చెక్ చేయండి

Property Purchase : ఇల్లు కొనడం అనేది మన జీవితంలో ఒక పెద్ద కల. అయితే, ఈ ముఖ్యమైన దశలోనే చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. ఎందుకంటే, ఆస్తికి సంబంధించిన పత్రాలను సరిగ్గా తనిఖీ చేయడంలో విఫలమవుతారు. భారతదేశంలో ఆస్తికి సంబంధించిన మోసాలు, వివాదాలు సర్వసాధారణం. మీ డబ్బు, మీ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే, డబ్బు చెల్లించే ముందు లేదా సంతకం చేసే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. మరి ఇంటిని కొనే ముందు తప్పకుండా చెక్ చేయాల్సిన ఆ 6 ముఖ్యమైన పత్రాలు, విషయాలు ఏంటో చూద్దాం.
1. టైటిల్ డీడ్
ఆస్తికి అసలు యజమాని ఎవరనేది నిరూపించే ముఖ్యమైన డాక్యుమెంట్ టైటిల్ డీడ్. దీన్ని అమ్మకందారు నుంచి అడిగి, ఒరిజినల్ కాపీని చూడాలి. టైటిల్ డీడ్‌లో ఉన్న పేరు ప్రభుత్వ రికార్డులతో సరిపోలుతుందో లేదో నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా, ఆ ఆస్తిపై ఎలాంటి వివాదాలు లేవని, లేదా అది ఎవరికీ తనఖా పెట్టలేదని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది ఆస్తిపై అమ్మకందారుకు పూర్తి హక్కు ఉందని ధృవీకరిస్తుంది.
2. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్
ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు కొనబోయే ఆస్తిపై ఏదైనా లోన్ లేదా ఇతర చట్టపరమైన బాధ్యతలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఈసీ సాధారణంగా సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి లభిస్తుంది. ఇది గత 15 నుంచి 30 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. ఒకవేళ ఆ ఆస్తిపై బ్యాంకు లోన్ ఉంటే, ఈ సర్టిఫికెట్‌లో తప్పక కనిపిస్తుంది. దీనివల్ల అమ్మకందారు తన బాధ్యతలను మీపైకి నెట్టేయకుండా జాగ్రత్తపడవచ్చు.
3. బిల్డింగ్ ప్లాన్, అప్రూవల్స్
మీరు ఒక అపార్ట్‌మెంట్ లేదా హౌస్ ప్రాజెక్ట్‌లో ఇల్లు కొంటున్నట్లయితే, బిల్డర్‌కు స్థానిక అభివృద్ధి సంస్థ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనేది తప్పకుండా తనిఖీ చేయాలి. వారు ఆమోదించిన భవనం ప్లాన్ కాపీని అడగండి. నిర్మాణం ప్లాన్ ప్రకారం జరుగుతోందా లేదా అని సరిచూసుకోండి. సరైన అనుమతులు లేని లేదా అక్రమ నిర్మాణంపై భవిష్యత్తులో జరిమానా, కూల్చివేత నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
4. పన్నులు, బిల్లులు
ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ , కరెంటు, నీటి బిల్లులు వంటి బకాయిలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేయాలి. అమ్మకందారు నుంచి తాజా పన్ను రసీదులు తీసుకుని, ఎలాంటి బకాయిలు లేవని నిర్ధారించుకోవాలి. దీనివల్ల ఆ ఆస్తి స్థానిక సంస్థలలో సరిగ్గా రిజిస్టర్ అయిందనే విషయం కూడా తెలుస్తుంది.
5. RERA రిజిస్ట్రేషన్
మీరు కొంటున్న ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంటే, ఆ బిల్డర్ ప్రాజెక్ట్‌ను రెరా (RERA - Real Estate Regulatory Authority) లో రిజిస్టర్ చేశారా లేదా అనేది తప్పకుండా చూడాలి. ప్రతి రాష్ట్రానికి సొంత RERA వెబ్‌సైట్ ఉంటుంది. అందులో ప్రాజెక్ట్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ స్థితిని తనిఖీ చేయవచ్చు. RERA రిజిస్ట్రేషన్ వలన కొనుగోలుదారులకు పూర్తి పారదర్శకత, చట్టపరమైన రక్షణ లభిస్తుంది.
6. లాయర్ సహాయం
డాక్యుమెంట్లను తనిఖీ చేయడానికి లాయర్‌ను నియమించుకుంటే కొంత ఖర్చయినా, భవిష్యత్తులో లక్షల రూపాయల నష్టాన్ని నివారించవచ్చు. ప్రాపర్టీ లాయర్ సాధారణంగా మన కంటికి కనిపించని లోపాలను, సమస్యలను గుర్తించగలుగుతారు. అంతేకాకుండా, మీ కొనుగోలు ఒప్పందం, సేల్ డీడ్ చట్టబద్ధంగా పటిష్టంగా ఉండేలా చూస్తారు.
