Early Retirement Trend: తొందరగా రిటైర్ కావాలని యువత తాపత్రయం.. అసలు కారణం ఇదే ?
అసలు కారణం ఇదే ?

Early Retirement Trend: ప్రస్తుత ఆధునిక కాలంలో యువత ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. కేవలం ఉద్యోగం చేయడం, జీవితాంతం పనిచేయడం కాకుండా వీలైనంత త్వరగా రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని నేటి ట్రెండీ యువత కోరుకుంటోంది. యాక్సిస్ మాక్స్ లైఫ్ నిర్వహించిన తాజా ఐరిస్ 6.0 నివేదిక ప్రకారం.. భారతదేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన సుమారు 70 శాతం మంది ప్రజలు తమ ఆర్థిక అవసరాలు తీరితే నిర్ణీత వయసు కంటే ముందే ఉద్యోగాలకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో సగం మంది తమ 50 ఏళ్ల వయసు రాకముందే ఫైర్ (FIRE - Financial Independence, Retire Early) సూత్రాన్ని పాటించి రిటైర్మెంట్ పొందాలని కలలు కంటున్నారు.
ఈ సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, నేటి జెన్-జీ తరానికి చెందిన యువకులు చాలా ముందే అప్రమత్తమవుతున్నారు. సగటున 29 ఏళ్ల వయసులోనే వారు రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న జెన్-జీ యువకులలో దాదాపు 62 శాతం మంది ఇప్పటికే తమ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆందోళనకరమైన విషయం కూడా బయటపడింది. త్వరగా రిటైర్ కావాలనే కోరిక భారీగా ఉన్నప్పటికీ, తమ దగ్గర ఉన్న లేదా జమ చేస్తున్న డబ్బు జీవితాంతం సరిపోతుందనే పూర్తి నమ్మకం కేవలం 11 శాతం మందికి మాత్రమే ఉంది. మిగిలిన వారికి ద్రవ్యోల్బణం,పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో భయం వెంటాడుతోంది.
సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా బతకాలంటే కోటి రూపాయలు సరిపోతాయని గతంలో చాలామంది భావించేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ లెక్కలు కూడా మారుతున్నాయి. గత ఏడాది 77 శాతం మంది రూ.కోటి సరిపోతుందని అనుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 70 శాతానికి పడిపోయింది. అంటే మెట్రో నగరాల్లో, ఎక్కువ సంపాదన ఉన్న కుటుంబాలలో రూ.కోటి రిటైర్మెంట్ కార్పస్ ఇప్పుడు సరిపోదని, మరింత ఎక్కువ మొత్తం అవసరమని అందరూ గమనిస్తున్నారు. అందుకే కేవలం ప్లానింగ్ చేసుకోవడమే కాకుండా, క్రమశిక్షణతో కూడిన పెద్దమొత్తపు పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

