Old Monk : గడ్డకట్టే చలికి గుడ్ బై చెప్పేయండి..355 రూపాయలకే చుక్కా, ముక్కా రెడీ
355 రూపాయలకే చుక్కా, ముక్కా రెడీ

Old Monk : ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. జనవరి 15 దాటినా చలి తీవ్రత తగ్గకపోగా, ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు సామాన్యులను గజగజ వణికిస్తున్నాయి. ఇలాంటి గడ్డకట్టే చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మందు బాబుల లెక్క మాత్రం వేరేలా ఉంటుంది. చలి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో రమ్‌కు గిరాకీ అమాంతం పెరిగిపోతుంది. అందులోనూ గత 71 ఏళ్లుగా భారతీయుల మనసు గెలుచుకున్న ఒకే ఒక్క బ్రాండ్ ఓల్డ్ మాంక్.
భారతదేశంలో రమ్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు 'ఓల్డ్ మాంక్'. ఇది కేవలం ఒక మద్యం బ్రాండ్ మాత్రమే కాదు, డ్రింక్ ప్రియులకు ఒక ఎమోషన్. 1954లో మోహన్ మీకిన్ లిమిటెడ్ ఈ ఐకానిక్ డార్క్ రమ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఏడు దశాబ్దాలు గడిచినా, ఎన్నో విదేశీ బ్రాండ్లు వచ్చినా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ 'డార్క్ రమ్' అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం. దీనిలో ఉండే వెనీలా, కారామెల్, మరియు డార్క్ చాక్లెట్ రుచులు ఇతర బ్రాండ్లతో పోలిస్తే దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ఓల్డ్ మాంక్ ఇంత రుచిగా ఉండటానికి ప్రధాన కారణం దాని తయారీ విధానం. మార్కెట్‌లో దీనికి సంబంధించి చాలా రకాలు ఉన్నా, 7 ఇయర్స్ ఓల్డ్ డార్క్ రమ్‌కు డిమాండ్ ఎక్కువ. దీనిని ఓక్ చెక్కతో తయారు చేసిన బ్యారెల్స్‌లో కనీసం ఏడు సంవత్సరాల పాటు నిల్వ ఉంచుతారు. ఈ నిరీక్షణే దానికి ఆ ప్రత్యేకమైన సువాసనను, గాఢమైన రుచిని అందిస్తుంది. ఇంకా ప్రీమియం కావాలనుకునే వారి కోసం ఓల్డ్మంక్ సుప్రీం ఉంది, దీనిని ఏకంగా 18 ఏళ్ల పాటు నిల్వ ఉంచి సిద్ధం చేస్తారు. ఆ స్మూత్ టెక్స్చర్ అనుభవిస్తే తప్ప వర్ణించలేం.
ఓల్డ్ మాంక్ ఇంతలా సక్సెస్ కావడానికి మరో ముఖ్య కారణం దాని ధర. అతి తక్కువ ధరలో ప్రీమియం క్వాలిటీ అందించడంలో దీనికి మించిన బ్రాండ్ లేదని చెప్పవచ్చు. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో 180 ml క్వార్టర్ బాటిల్ ధర సుమారు 355 రూపాయలకే అందుబాటులో ఉంది. ఇక 750 ml ఫుల్ బాటిల్ కూడా వెయ్యి రూపాయల లోపు ధరలోనే లభిస్తుంది. రాష్ట్రాలను బట్టి పన్నుల వల్ల ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. విస్కీతో పోలిస్తే ఇందులో ఆల్కహాల్ శాతం 42.8% ఉండటంతో చలిని తట్టుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అని మందు బాబులు నమ్ముతుంటారు.
ఎలాంటి భారీ ప్రకటనలు లేకుండానే కేవలం మౌత్ టాక్ ద్వారానే ఓల్డ్ మాంక్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశంలోని ప్రతి గల్లీలో ఉన్న వైన్ షాపుల్లోనూ ఇది దర్శనమిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కూడా డెలివరీ చేసే వెసులుబాటు ఉంది. ఆ ముసలి సాధువు బొమ్మ ఉన్న బాటిల్ కనిపిస్తే చాలు.. చలిలో ఉండే కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా సేదతీరవచ్చు అని తాగేవాళ్లు మురిసిపోతుంటారు. ఏది ఏమైనా, 71 ఏళ్లుగా ఈ ఇండియన్ బ్రాండ్ రాజసం తగ్గకుండా కొనసాగుతుండటం విశేషం.

