Fuel Price : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గగానే.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వెంటనే తగ్గుతాయని సామాన్యులు ఆశిస్తుంటారు. అయితే, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధర కేవలం క్రూడ్ ఆయిల్ ధరపై మాత్రమే ఆధారపడదు. పన్నులు, రూపాయి-డాలర్ మారకం విలువ, రిఫైనింగ్, రవాణా ఖర్చులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రైసింగ్ స్ట్రాటజీ వంటి మొత్తం 8 కీలక అంశాలు మన దేశంలో ఇంధన ధరలను నిర్ణయిస్తాయి.

పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే ఈ ధరలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తాయి. అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో మినహాయింపులు ఇస్తూ వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంటుంది.

పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే 8 ప్రధాన అంశాలు

* అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర:పెట్రోల్, డీజిల్ తయారీకి ప్రధాన ముడి సరుకు క్రూడాయిల్. అంతర్జాతీయంగా దీని ధర పెరిగితే ఇంధన ధరలు పెరగడం, తగ్గితే తగ్గడం జరుగుతుంది. అయితే, భారతదేశంలో ఈ ప్రభావం వెంటనే నేరుగా కనిపించదు.

* రూపాయి - డాలర్ మార్పిడి రేటు :

భారత్ తన అవసరాలకు కావలసిన ముడి చమురులో మెజారిటీ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనికి చెల్లింపులు డాలర్లలో జరుగుతాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడితే దిగుమతి భారం పెరుగుతుంది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ చౌకగా లభించినా మనకు ఆశించినంత ఊరట దక్కదు.

* రిఫైనింగ్ కాస్ట్ (శుద్ధి ఖర్చులు):

దిగుమతి చేసుకున్న ముడి చమురును నేరుగా వాడలేం. దానిని రిఫైనరీలలో ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్‌గా మారుస్తారు. ఈ ప్రాసెసింగ్ కాస్ట్ కూడా లీటర్ ధరలో కలుస్తుంది.

* రవాణా ఖర్చులు :

రిఫైనరీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల డిపోలు, పెట్రోల్ బంకులకు ఇంధనాన్ని చేరవేసేందుకు అయ్యే లాజిస్టిక్స్ ఖర్చులు కూడా రిటైల్ ధరకు తోడవుతాయి.

* ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్జిన్:

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు మార్కెట్ పరిస్థితులు, ఇన్వెంటరీ నష్టాలు, అంతర్జాతీయ హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని తమ లాభాల మార్జిన్‌ను కేటాయించుకుంటాయి.

* డీలర్ కమిషన్:

లీటర్ పెట్రోల్, డీజిల్ విక్రయించినందుకు పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్ణీత కమిషన్ దక్కుతుంది. ఈ సొమ్ము కూడా మనకు లభించే లీటరు ధరలోనే ఉంటుంది.

* కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ :

కేంద్ర ప్రభుత్వం లీటర్ ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని విధిస్తుంది. ప్రభుత్వం ఈ పన్నును తగ్గించినప్పుడు వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది.

* రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ & ఇతర పన్నులు:

ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ స్వంత ఆదాయ వనరుగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, స్థానిక సెస్‌లను విధిస్తుంది. అందుకే ఒక రాష్ట్రంతో పోలిస్తే మరో రాష్ట్రంలో పెట్రోల్ ధరల్లో తేడాలుంటాయి.

పెట్రోలియం రంగంపై పన్నులు.. ప్రభుత్వ ఆదాయం

పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో సగానికి పైగా వాటా వివిధ రకాల పన్నులదే ఉంటుంది.

* కేంద్ర, రాష్ట్ర పన్నులు: ప్రధానంగా కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్ ఉంటాయి.

* ఇతర సుంకాలు: క్రూడ్ ఆయిల్ సెస్, కస్టమ్స్ డ్యూటీ, IGST, CGST, రాయల్టీల రూపంలో భారీగా పన్నులు వసూలవుతాయి.

* 2025-26 ఆర్థిక సంవత్సరంలో (తాత్కాలిక అంచనా ప్రకారం): పెట్రోలియం రంగం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.4.75 లక్షల కోట్లకు పైగా రాబడి సమకూరింది. ఇందులో కేవలం ఎక్సైజ్ డ్యూటీ వాటానే రూ.3.08 లక్షల కోట్లుగా నమోదైంది.

కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం రాబడి గణాంకాలు (రూ. కోట్లలో):

* 2021-22: 4,92,302

* 2022-23: 4,28,067

* 2023-24: 4,32,394

* 2024-25 (P): 4,24,827

* 2025-26 (P): 4,75,739

క్రూడాయిల్ తగ్గినా ధరలు ఎందుకు తగ్గవు?

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడిపోయినప్పటికీ, ఆయిల్ కంపెనీలు లేదా ప్రభుత్వాలు పాత నిల్వలు, రూపాయి మారకం క్షీణత, రాబడి బ్యాలెన్సింగ్, భవిష్యత్ మార్కెట్ అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుంటాయి. గతాన్ని పరిశీలిస్తే.. నవంబర్ 2021, మే 2022 లలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి లీటరుపై రూ.13 నుంచి రూ.16 వరకు ఊరట నిచ్చారు. అలాగే మార్చి 2024లో లీటరుకు రూ.2 తగ్గించగా, మార్చి 2026 మధ్యప్రాచ్య సంక్షోభం సమయంలో ప్రభుత్వం రూ.10 ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపునిచ్చి భారాన్ని తగ్గించింది. అందుకే గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు తగ్గినా.. రూపాయి విలువ, పన్నుల వ్యూహం, కంపెనీల మార్జిన్లు అన్నీ కలసి వస్తేనే సామాన్యుడికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story