8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చింది. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 49వ వార్షిక సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ మీటింగ్‌లో క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ పెన్షనర్లకు సంబంధించిన 5 అత్యంత కీలకమైన సాంకేతిక సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు పెన్షన్ల పెంపుతో పాటు పలు కీలక డిమాండ్లను త్వరలోనే ఏర్పాటు కాబోయే 8వ వేతన సంఘం పరిశీలనకు పంపుతామని ఆయన హామీ ఇచ్చారు.

జేసీఎం సమావేశంలో పరిష్కారమైన ఆ 5 కీలకమైన పెన్షన్ ముడులు ఇవే

1. ప్రతి 5 ఏళ్లకు పెన్షన్ పెంపు: ప్రస్తుత నిబంధనల ప్రకారం కేవలం వేతన సంఘం వచ్చినప్పుడే పెన్షన్లు మారుతున్నాయి. దీనివల్ల ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని ఉద్యోగ సంఘాలు కోరగా.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్ సవరించే ప్రతిపాదనను 8వ వేతన సంఘానికి బదిలీ చేయడానికి క్యాబినెట్ సెక్రటరీ అంగీకరించారు.

2. ఫ్యామిలీ పెన్షన్ తగ్గింపుపై ముకుతాడు: ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి భాగస్వామికి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ను చివరి జీతంలో 30 శాతానికి తగ్గించకూడదని, దానిని మరింత గౌరవప్రదంగా ఉంచాలనే డిమాండ్‌ను కూడా 8వ పే కమిషన్ పరిధిలోకి చేర్చారు.

3. వికలాంగ పిల్లల పెన్షన్‌కు ఆదాయ ధృవీకరణ పత్రం మినహాయింపు: శారీరక వికలాంగులైన డిపెండెంట్ పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ అందించేందుకు సివిల్ అధికారుల నుంచి ఆదాయం లేదు అనే సర్టిఫికేట్ అడగకూడదని జేసీఎం వాదించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఈ నిబంధనను సరళీకరించి ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకోవాలని పెన్షన్ శాఖను ఆదేశించింది.

4. డిసెంబర్ 22, 2003 నాటి ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) లబ్ధి: నేషనల్ పెన్షన్ సిస్టమ్ నోటిఫికేషన్ వచ్చిన డిసెంబర్ 22, 2003కి ముందు ఖాళీల నోటిఫికేషన్ వచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి అలాగే కారుణ్య నియామకాల కింద డిసెంబర్ 22, 2003 కి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయడానికి అంగీకారం కుదిరింది. కారుణ్య నియామకాల నిబంధనను వారం రోజుల్లోనే అమలు చేయనున్నారు.

5. కోడళ్లకు కూడా ఫ్యామిలీ పెన్షన్ హక్కు: కుటుంబం అనే నిర్వచనాన్ని సవరించి, పెన్షనర్ మరణిస్తే వారిపై ఆధారపడిన విధవరాలైన కోడళ్లకు కూడా ఫ్యామిలీ పెన్షన్ దక్కేలా చట్టాన్ని సవరించాలని పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖను న్యాయ శాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story