అకౌంట్లోకి రూ.4 లక్షల వరకు బకాయిలు?

8th Pay Commission : దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల ఇళ్లలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే 8వ వేతన సంఘం. ఇది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును మార్చే అతిపెద్ద నిర్ణయం. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్ తన పనిని జెట్ స్పీడ్‌తో కానిచ్చేస్తోంది. మే 2027 కల్లా పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీనివల్ల ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో పెరుగుతాయి? పెన్షనర్లకు వచ్చే లాభాలేంటి? అనే ఆసక్తికర విషయాలు చూద్దాం.

ఉద్యోగులందరి కళ్లు ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మీదనే ఉన్నాయి. ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. అయితే, పెరిగిన ధరలకు అనుగుణంగా దీన్ని 2.86 నుంచి 3.15 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం కనీసంగా 2.86 ఫ్యాక్టర్‌కు ఓకే చెబితే.. అద్భుతాలే జరుగుతాయి. ప్రస్తుతం నెలకు రూ.18,000 బేసిక్ శాలరీ తీసుకుంటున్న లోయర్ గ్రేడ్ ఉద్యోగుల జీతం ఏకంగా రూ.51,480కి చేరుతుంది. ఇక మిడిల్ లెవల్ అధికారుల బేసిక్ పే రూ.44,900 నుంచి రూ.1.28 లక్షల మార్కును దాటేస్తుంది. బేసిక్ పెరిగితే దానికి తోడుగా ఇంటి అద్దె భత్యం కూడా భారీగా పెరుగుతుంది.

కేవలం పని చేసే వారికే కాదు, రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా ఈ వేతన సంఘం బంపర్ ఆఫర్లు తీసుకురాబోతోంది. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు తగ్గించే ఆలోచనలో కమిషన్ ఉంది. అంటే రిటైర్ అయిన వారు తీసుకున్న అడ్వాన్స్ సొమ్ము త్వరగా తీరిపోయి, పూర్తి పెన్షన్ త్వరగా అందుతుంది. అలాగే, 80 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని 65 ఏళ్ల నుంచే మొదలుపెట్టాలని చూస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం ఇచ్చే మెడికల్ అలవెన్స్‌ను కూడా రూ.1000 నుంచి రూ.5000 వరకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల కనిష్ట పెన్షన్ రూ.9,000 నుంచి ఏకంగా రూ.22,000 దాటే ఛాన్స్ ఉంది.

అయితే, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు మాత్రం కేంద్రం షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వీరికి ప్రత్యేక పే రివిజన్ కమిటీ వేసే ఉద్దేశం లేదని పార్లమెంటులో స్పష్టం చేసింది. ఆయా కంపెనీల లాభాలు, ఆర్థిక స్థితిగతుల బట్టే అక్కడి ఉద్యోగుల జీతాలు ఉంటాయని తేల్చి చెప్పింది. మరోవైపు, ఈ వేతన సంఘం కొత్త రూల్స్ ప్రకారం.. సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాలి. నివేదిక ఆలస్యమైనా సరే, అమలు చేసేటప్పుడు 2026 జనవరి నుండి అప్పటి వరకు ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లిస్తారు. అంటే సగటున ప్రతి ఉద్యోగి ఖాతాలో రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నగదు వచ్చి పడే అవకాశం ఉంది.

ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిషన్ MyGov పోర్టల్ ద్వారా 18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని విడుదల చేసింది. ఇందులో మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్, వార్షిక ఇంక్రిమెంట్లను పనితీరుతో ముడిపెట్టడం వంటి ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఏప్రిల్ 30, 2026 లోపు ఎవరైనా తమ సలహాలను పంపవచ్చు. మొత్తానికి 8వ వేతన సంఘం రాకతో ప్రభుత్వ ఉద్యోగుల దశ తిరగబోతోందని చెప్పాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story