8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్
8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం 8వ వేతన సంఘం. తమ జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతాయని వారు గంపెడాశలు పెట్టుకున్నారు. నవంబర్ 2025లో ఈ కమిషన్ తన విధివిధానాలను ప్రకటించిన నాటి నుంచి 18 నెలల లోపు తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) ఒక కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది.
కొత్త వేతన సవరణలను జనవరి 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తోంది. అంటే, 8వ వేతన సంఘం తన నివేదికను ఎప్పుడు సమర్పించినా సరే, ఉద్యోగులకు,పెన్షనర్లకు మాత్రం 2026 జనవరి 1 నుంచి లెక్కగట్టి బకాయిలు చెల్లించాలని కోరుతోంది. వేతన సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచిన 18 ప్రశ్నల ప్రశ్నావళికి సమాధానంగా ఈ డిమాండ్లను యూనియన్లు వ్యక్తం చేశాయి. ఉద్యోగుల జీవన ప్రమాణాలు, పెరిగిన ధరల దృష్ట్యా వేతన సవరణ ఇప్పటికే ఆలస్యమైందని, భవిష్యత్తులో ఏదో ఒక తేదీని నిర్ణయిస్తే ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారని వారు వాదిస్తున్నారు.
గత చరిత్రను పరిశీలిస్తే, ప్రభుత్వం ఎప్పుడూ పాత వేతన సంఘం గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే కొత్త వేతనాలను వర్తింపజేస్తూ వస్తోంది. ఉదాహరణకు, 6వ వేతన సంఘం తన నివేదికను 2008 మార్చిలో ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు 2006 జనవరి 1 నుంచి బకాయిలు అందాయి. అలాగే, 7వ వేతన సంఘం నివేదిక 2015 నవంబర్‌లో వచ్చినా, ప్రభుత్వం దానిని 2016 జనవరి 1 నుంచి అమలు చేసింది. అయితే 7వ పే కమిషన్ ప్రకటించినప్పుడే దాని అమలు తేదీని ప్రభుత్వం సూచించింది, కానీ 8వ పే కమిషన్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ గోప్యత పాటిస్తోంది.
ఒకవేళ ప్రభుత్వం ఏఐటీయూసీ డిమాండ్‌ను అంగీకరిస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ స్లిప్‌లు పూర్తిగా మారిపోతాయి. బేసిక్ పే పెరగడంతో పాటు డీఏ, ఇతర భత్యాలు కూడా భారీగా పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడినప్పటికీ, పెరుగుతున్న నిత్యావసర ధరల మధ్య ఇది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

