8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలుపై సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఈ కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలుల్లోకి రాగానే ఉద్యోగుల ఖాతాల్లోకి భారీగా డబ్బులు వచ్చి చేరనున్నాయి. ముఖ్యంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు భారీ మొత్తంలో బకాయిలు (ఎరియర్స్) అందే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కమిషన్ వివిధ వర్గాలతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల నుంచి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే, ఉద్యోగులకు అందే ఎరియర్స్ మొత్తం అనేది ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది ఈ నివేదిక ఏ తేదీ నుంచి అమలుల్లోకి వస్తుంది అనేది కాగా, రెండోది ప్రభుత్వం ఎంత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేస్తుంది అనేది.

అసలు 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమలుల్లోకి రావచ్చు?

ఈ కొత్త వేతన సంఘం సిఫార్సులు ఎప్పుడు అమలువుతాయనే దానిపై ఆర్థిక నిపుణుల్లో రకరకాల అంచనాలు ఉన్నాయి. కొందరు నిపుణుల ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సులు మార్చి 2027 నుంచి అమలు కావచ్చు. మరికొందరు మాత్రం ఈ మొత్తం ప్రక్రియ ముగియడానికి మే 2027 దాటవచ్చని భావిస్తున్నారు. కమిషన్ తన నివేదికను మార్చి 2027 నాటికి ప్రభుత్వానికి సమర్పిస్తే, ఏప్రిల్ 2027 నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందే ఛాన్స్ ఉంది. అయితే, ఈ నివేదికను పక్కాగా సిద్ధం చేయడానికి కమిషన్‌కు కనీసం 18 నెలల సమయం పడుతుందని, అవసరమైతే ప్రభుత్వం నుంచి మరికొంత సమయం కూడా కోరవచ్చని మరో వాదన వినిపిస్తోంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతోంది?

ఉద్యోగుల జీతాల పెంపును నిర్ణయించేది ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టరే. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) స్టాఫ్ సైడ్ వారు ప్రభుత్వానికి 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేశారు. కానీ ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంత పెద్ద మొత్తంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం దీనికి ఓకే చెబితే, ప్రస్తుతం రూ.18,000 బేసిక్ జీతం తీసుకుంటున్న ఉద్యోగి మూల వేతనం నేరుగా రూ.37,800కి పెరుగుతుంది.

లెవెల్ 1 నుంచి లెవెల్ 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ఎవరు?

ఏడో వేతన సంఘం పే మెట్రిక్స్ ప్రకారం లెవెల్ 1 నుంచి 5 పరిధిలోకి వచ్చే వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ప్రారంభ స్థాయి సిబ్బంది ఉంటారు. ఇందులో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), ప్యూన్లు, ఆఫీస్ అటెండెంట్లు, లోయర్ డివిజన్ క్లర్కులు (LDC), అప్పర్ డివిజన్ క్లర్కులు (UDC), సీనియర్ క్లర్కులు, టెక్నీషియన్లు, స్టెనోగ్రాఫర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, స్టాఫ్ నర్సులు వంటి వారు ఈ కేటగిరీ కిందకు వస్తారు. వీరందరికీ 8వ వేతన సంఘం ద్వారా భారీ లబ్ధి చేకూరనుంది.

లెక్కలు మారితే ఎవరికి ఎంత ఎరియర్స్ వచ్చే అవకాశం ఉంది?

ఆర్థిక విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఒకవేళ సవరించిన జీతాలు సెప్టెంబర్ 2027 నుంచి వర్తింపజేస్తే, ఉద్యోగులకు సుమారు 20 నెలల బకాయిలు (ఎరియర్స్) చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం 2.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేస్తే లెవెల్-1 ఉద్యోగికి రూ. 3.60 లక్షలు, లెవెల్-5 ఉద్యోగికి రూ. 5.82 లక్షల ఎరియర్స్ వస్తాయి. అదే 2.15 ఫ్యాక్టర్ అయితే రూ. 4.14 లక్షల నుంచి రూ. 6.69 లక్షల వరకు అందుతుంది. ఒకవేళ 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే లెవెల్-1 వారికి రూ. 5.65 లక్షలు, లెవెల్-5 వారికి రూ. 9.13 లక్షలు లభిస్తుంది. ఒకవేళ అదృష్టం బాగుండి ప్రభుత్వం 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేస్తే లెవెల్-1 ఉద్యోగికి రూ. 6.69 లక్షలు, లెవెల్-5 ఉద్యోగికి ఏకంగా రూ. 10.82 లక్షల భారీ ఎరియర్స్ సొమ్ము చేతికి అందుతుంది. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమేనని, ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేశాకే అసలు లెక్కలు తెలుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story