8th Pay Commission : 8వ వేతన సంఘంపై ఉద్యోగుల గురి.. పెన్షన్ నుంచి గ్రాట్యుటీ వరకు కేంద్ర ప్రభుత్వానికి 3 డిమాండ్లు
పెన్షన్ నుంచి గ్రాట్యుటీ వరకు కేంద్ర ప్రభుత్వానికి 3 డిమాండ్లు

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఏర్పాటు చేయబోతున్న 8వ వేతన సంఘంకు సంబంధించి చర్చలు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు తమ డిమాండ్లు, సూచనలను వేగంగా కమిషన్ ముందుకు తీసుకెళ్తున్నాయి. సాధారణంగా జీతాల సవరణ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సుల పెంపుపై ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. కానీ, ఈసారి పెన్షనర్ల సంఘాలు రిటైర్మెంట్ తర్వాత తమకు లభించే ఆర్థిక భద్రత మరియు సామాజిక రక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే రైల్వే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ(RSCWS) కేంద్ర వేతన సంఘానికి ఒక సమగ్రమైన మెమోరాండం సమర్పించింది.
పెన్షనర్ల నుంచి వచ్చిన మూడు అతిముఖ్యమైన డిమాండ్లలో మొదటిది పెన్షన్ కమ్యుటేషన్‌కు సంబంధించినది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయంలో తమ పెన్షన్ లోని కొంత భాగాన్ని ఒకేసారి ముందస్తుగా (కమ్యూటెడ్ పెన్షన్ రూపంలో) తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇలా ఒకేసారి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించి, మళ్లీ పూర్తి పెన్షన్ పొందడానికి ప్రస్తుతం ఏకంగా 15 ఏళ్ల సుదీర్ఘ సమయం పడుతోంది. ప్రస్తుత తక్కువ వడ్డీ రేట్ల కాలంలో ఈ 15 ఏళ్ల గడువు పెన్షనర్లపై తీవ్ర భారం మోపుతోందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే ఈ రికవరీ కాలాన్ని 10 నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని, తద్వారా వృద్ధాప్యంలో పూర్తి పెన్షన్ త్వరగా అందుతుందని కోరుతున్నారు.
రెండో ప్రధాన డిమాండ్ డెత్-కమ్-రిటైర్మెంట్ గ్రాట్యుటీ పరిమితికి సంబంధించినది. దేశంలో పెరుగుతున్న జీతాల స్థాయిలు, నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రైల్వే పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. దీనితో పాటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద రిటైర్ అయ్యే ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ నిబంధనలను ఒకేలా హేతుబద్ధం చేయాలని కోరారు. మార్కెట్ రేట్లకు అనుగుణంగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితిని కూడా పెంచాలని సూచించారు.
మూడో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే.. ఉద్యోగులు తమ సుదీర్ఘ సేవల తర్వాత రిటైర్ అయిన వెంటనే వారికి రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్ వంటి అన్ని రకాల ఆర్థిక బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యంత వేగంగా చెల్లించాలి. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యాక కూడా తమ సొంత డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇది వారిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తోందని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ ఆలస్యాన్ని పూర్తిగా నివారించడానికి 8వ వేతన సంఘం ఒక పటిష్టమైన, వేగవంతమైన కేంద్రీకృత వ్యవస్థను సిఫార్సు చేయాలని గట్టిగా కోరారు.
రైల్వే పెన్షనర్ల సంఘం మరో ఆసక్తికరమైన ప్రతిపాదనను కూడా కమిషన్ ముందు ఉంచింది. సైనిక ఉద్యోగులకు అమలు చేస్తున్న వన్ ర్యాంక్, వన్ పెన్షన్ సూత్రాన్ని సివిలియన్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరింది. అంటే ఒకే హోదాలో, ఒకే కాలపరిమితితో పనిచేసి వేర్వేరు సంవత్సరాల్లో రిటైర్ అయిన ఉద్యోగులందరికీ సమానమైన పెన్షన్ ప్రయోజనాలు అందాలి. దీనివల్ల సీనియర్, జూనియర్ పెన్షనర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. అలాగే 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం ద్వారానే పెన్షనర్లందరి మధ్య సమానత్వం సాధ్యమవుతుందని తమ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు.

