8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులు, అవి అమలయ్యే తేదీపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. కమిషన్ నివేదిక సమర్పించడానికి, కొత్త జీతాలు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ కొత్త జీతాలు మునుపటి తేదీ నుంచి వర్తింపజేస్తే, మధ్య కాలానికి సంబంధించిన బకాయిలు లేదా ఏరియర్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏరియర్ మొత్తం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, సవరించిన బేసిక్ పే, ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

8వ వేతన సంఘానికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం నివేదిక సమర్పించడానికి 18 నెలల సమయం కేటాయించారు. దీని ప్రకారం ఈ నివేదిక 2027 మే నాటికి వచ్చే అవకాశం ఉంది. అయితే అవసరమైతే గడువు పొడిగించాలని కమిషన్ కోరవచ్చు. మార్చి నుంచి ఆగస్టు 2027 మధ్య కాలంలో ఈ రిపోర్ట్ వెలువడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. జనవరి 1, 2026 నుంచి కొత్త జీతాలు అమల్లోకి వస్తే, ఆ మధ్య కాలానికి సంబంధించిన వ్యత్యాసాన్ని ఎరియర్‌గా చెల్లించే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.

వివిధ లెవెల్స్ ఉద్యోగులకు అందే అంచనా ఎరియర్స్

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా వివిధ ఉద్యోగ స్థాయిల వారీగా ఏరియర్ మొత్తాలు మారనున్నాయి.

* లెవెల్ 6 ఉద్యోగులు: ప్రస్తుత బేసిక్ పే రూ.35,400 ఉండగా, 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం 24 నెలల ఏరియర్ సుమారు రూ.13.34 లక్షల వరకు ఉండవచ్చు.

* లెవెల్ 7 ఉద్యోగులు: ప్రస్తుత బేసిక్ పే రూ.44,900గా పరిగణించి, 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో చూస్తే 24 నెలల ఏరియర్ దాదాపు రూ.16.92 లక్షల వరకు చేరే అవకాశం ఉంది.

* లెవెల్ 8 ఉద్యోగులు: లెవెల్ 8 ఉద్యోగి బేసిక్ పే రూ.47,600 అనుకుంటే, 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం 20 నెలల ఎరియర్ రూ.14.95 లక్షలు, 24 నెలలకు గాను ఏకంగా రూ.17.94 లక్షల వరకు ఎరియర్ అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అన్ని భత్యాలపై ఏరియర్స్ వర్తించవు

ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఏరియర్ లెక్కలన్నీ కేవలం బేసిక్ పే లో వచ్చే సంభావ్య పెరుగుదలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. హెచ్‌ఆర్‌ఏ బేసిక్ పే తో ముడిపడి ఉంటుంది కాబట్టి కొత్త బేసిక్ సాలరీ ప్రకారం మారవచ్చు. కానీ డీఏ రివ్యూ ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. అందువల్ల అన్ని రకాల అలవెన్సులు లేదా భత్యాలపై ఒకే రకమైన ఏరియర్స్ వస్తాయని ఆశించలేము. ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని, ప్రభుత్వ తుది ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది.

Next Story