ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో బేసిక్ శాలరీ ఎలా పెరుగుతుంది?

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘాన్ని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత జీతాలు, భత్యాలు, ఇతర సౌకర్యాలను పూర్తిగా సమీక్షించి, 18 నెలల్లో తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ సిఫార్సులు అమలైతే, కోట్లాది కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై భారీ ప్రభావం చూపడంతో పాటు, ఉద్యోగుల జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేతన కమిషన్ ద్వారా ఎలాంటి మార్పులు రానున్నాయి? జీతాలు ఎలా పెరుగుతాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాల వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి 8వ వేతన సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేంద్ర ఉద్యోగుల జీతాలు, భత్యాలు మరియు సౌకర్యాలను పూర్తిస్థాయిలో సమీక్షిస్తుంది. కమిషన్ తన సిఫార్సులను రాబోయే 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులు కేంద్ర ఉద్యోగులు, రక్షణ దళాలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, పెన్షనర్ల ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి.

ఈసారి వేతనాల పెంపు కేవలం ద్రవ్యోల్బణం లేదా సీనియారిటీ ఆధారంగా కాకుండా, ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. బాగా పనిచేసే ఉద్యోగులకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరేలా వేతన వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే, ప్రతి ఉద్యోగి బాధ్యత, పని స్వభావం వేరుగా ఉండటం వల్ల ప్రభుత్వ వ్యవస్థలో పనితీరు ఆధారిత జీతాన్ని అమలు చేయడం అంత తేలిక కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బేసిక్ సాలరీ నిర్మాణం అందరికీ సమానంగా ఉంచి, వార్షిక పనితీరు ఆధారంగా అదనపు బోనస్‌లు లేదా ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వేతన సంఘం సిఫార్సుల్లో అత్యంత కీలకం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. దీని ఆధారంగానే బేసిక్ శాలరీ నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం కనిష్ట బేసిక్ శాలరీ రూ.18,000గా ఉంది. దీనిపై 58% డీఏ కలుపుకుంటే, మొత్తం జీతం దాదాపు రూ.28,440 అవుతుంది.

కొత్త వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.0 గా సిఫారసు చేస్తే, కనీస బేసిక్ శాలరీ రూ.36,000కు చేరుకుంటుంది. అంటే, కనీస జీతం ఉన్నవారి జీతం దాదాపు రెట్టింపు అవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుంచి 2.46 మధ్య ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 2.46 వరకు పెరిగితే, మొత్తం జీతంలో సుమారు 55% వరకు పెరుగుదల నమోదు కావచ్చు. బేసిక్ శాలరీతో పాటు HRA (ఇంటి అద్దె భత్యం), ట్రావెల్ అలవెన్స్, మెడికల్ భత్యాలు కూడా కొత్త బేసిక్ శాలరీ ఆధారంగా పెరుగుతాయి. దీనివల్ల మొత్తం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తుంది.

8వ వేతన సంఘం సిఫార్సుల పరిధిలో కేంద్ర ఉద్యోగులు మాత్రమే కాక, పలువురు అధికారులు,పెన్షనర్లు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక, పారిశ్రామికేతర ఉద్యోగులు, రక్షణ దళాల సిబ్బంది, అఖిల భారత సర్వీసుల అధికారులు (IAS, IPS), కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులు, ఆడిట్ విభాగం, న్యాయ సేవలకు సంబంధించిన సిబ్బందికి దీని ప్రయోజనం లభిస్తుంది. ఈ కమిషన్ ఎన్‌పీఎస్‌, పాత పెన్షన్ విధానం రెండింటినీ సమీక్షిస్తుంది. ముఖ్యంగా, ఎన్‌పీఎస్‌ కింద ఉన్నవారికి గ్రాట్యుటీ, డెత్ బెనిఫిట్ నియమాలలో మెరుగుదలలు తీసుకురావచ్చని భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story