8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పనులు దేశవ్యాప్తంగా వేగవంతమయ్యాయి. ఆగస్టు మొదటి వారంతో ఈ కమిషన్ కేటాయించిన 18 నెలల కాలపరిమితిలో సగం సమయం, అంటే 9 నెలలు పూర్తవుతాయి. నవంబర్ 2025లో జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్, ఇప్పుడు తన రెండో దశ పనుల్లోకి అడుగుపెట్టింది. రాబోయే కొద్ది నెలల్లో ఉద్యోగి సంఘాలు, పెన్షనర్లు, ఇతర భాగస్వామ్య వర్గాలతో చర్చలను పూర్తి చేసి, జీతాల పెంపు, అలవెన్సులు, పెన్షన్ సంస్కరణలపై తుది నివేదికను రూపొందించడంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా 5 కీలక నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 5 కీలక అప్‌డేట్లు

8వ వేతన సంఘం తన సంప్రదింపుల ప్రక్రియను దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరింపజేస్తోంది. జులై 28న విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం..సెప్టెంబర్ 16 నుండి 18 వరకు ఛండీగఢ్‌లో రీజినల్ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం అపాయింట్‌మెంట్ పొందేందుకు ఆగస్టు 25 వరకు గడువు విధించారు. అంతకుముందు జులై 24న ఇచ్చిన ప్రకటనల ప్రకారం.. సెప్టెంబర్ 9న పుదుచ్చేరిలో, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో చెన్నైలో దక్షిణ భారత ఉద్యోగ సంఘాలు, అధికారులతో చర్చలు జరపనున్నారు. అలాగే ఆగస్టు 7, 10 తేదీలలో ఢిల్లీ కేంద్రంగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనుండగా, జులై 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. కాగా, అంతకుముందు మే 29 నాటి నిర్ణయం ప్రకారం భాగస్వాములందరికీ తమ విజ్ఞాపన పత్రాలు సమర్పించేందుకు జూన్ 15 వరకు సమయం పెంచిన సంగతి తెలిసిందే.

అధికారిక నివేదికల సమర్పణపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత

ఇటీవల రాజ్యసభ వేదికగా విచారణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. వేతన సంఘం తన సంప్రదింపుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి ప్రాసెస్ నివేదిక రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్(ToR) ఆధారంగానే కమిషన్ తన సంప్రదింపుల విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయించుకుంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, మే లేదా జూన్ 2027 నాటికి 8వ వేతన సంఘం తన అంతిమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనాలు.. 1.1 కోట్ల మందికి మేలు

ప్రస్తుతం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఢిల్లీ, చెన్నై, పుదుచ్చేరి, ఛండీగఢ్‌లలో వరుసగా జరగనున్న సమావేశాల ద్వారా ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సులు, ఉద్యోగుల పనితీరు ప్రోత్సాహకాలపై అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 1.1 కోట్ల మందికి పైగా సేవలో ఉన్న ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. BPMS, NCJCM, AIDEF వంటి ప్రముఖ ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఉన్న ఫిట్‌మెంట్ మల్టిప్లైయర్‌ను 3.8x నుంచి 4x వరకు పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై వేతన సంఘం నుండి గానీ, కేంద్ర ప్రభుత్వం నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story