8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు ఒక అత్యంత తీపి కబురు అందింది. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కీలక అడుగులు వేస్తోంది. తమ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో వచ్చే జూన్ 22, 23వ తేదీల్లో ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు జరిగే సుదీర్ఘ చర్చల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ఉద్యోగ సంఘాలు, కార్మిక సమాఖ్యలు పంపిన ప్రతిపాదనలపై క్షుణ్ణంగా సమీక్షించనున్నారు.

ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఉద్యోగుల సమస్యలను, వారి డిమాండ్లను నేరుగా విని తెలుసుకోవడమే. దీని ద్వారా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే కొత్త జీతాల నిర్మాణాన్ని ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి వీలవుతుంది. అయితే, ఈ లక్నో సమావేశంలో పాల్గొని తమ వాదనలను వినిపించాలనుకునే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉద్యోగ సంఘాలు తప్పనిసరిగా జూన్ 10, 2026 లోపు ఎన్ఐసీ అధికారిక వెబ్‌సైట్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వేతన సంఘం స్పష్టం చేసింది.

గతంలో లాగా కాకుండా ఈసారి పే కమిషన్ ఈ అపాయింట్‌మెంట్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. పారదర్శకతను పెంచేందుకు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సమావేశంలో పాల్గొనాలనుకునే ప్రతీ యూనియన్ ముందుగా తమ డిమాండ్ పత్రాన్ని కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పత్రం విజయవంతంగా సబ్మిట్ అయిన తర్వాత సిస్టమ్ ద్వారా ఒక యూనిక్ మెమో ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీ ఆధారంగానే ఉద్యోగ సంఘాలకు లక్నో సమావేశంలో పాల్గొనేందుకు అపాయింట్‌మెంట్ స్లాట్ కేటాయిస్తారు. మెమో ఐడీ లేని వారికి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండదు.

మరోవైపు, దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల అసోసియేషన్లు తమ తుది సిఫార్సులను, విజ్ఞాపన పత్రాలను ఈ మే 31, 2026 లోపు సమర్పించాలని కమిషన్ గడువు విధించింది. దీంతో NC-JCM, AIDEF వంటి దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ సమాఖ్యలు తమ డిమాండ్లకు తుది రూపు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో అత్యంత ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ ఎంత ఉండాలనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది.

గతంలో అమలు చేసిన 7వ వేతన సంఘంలో ప్రభుత్వం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేసింది. దీనివల్ల ఉద్యోగుల కనీస బేసిక్ జీతం రూ.18,000గా మారింది. కానీ ప్రస్తుత విపరీతమైన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈసారి 8వ వేతన సంఘంలో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.86 నుంచి గరిష్టంగా 3.83 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక ఈ డిమాండ్లకు తలొగ్గితే, కొత్తగా ఉద్యోగంలో చేరే ఎంట్రీ లెవల్ ఉద్యోగి కనీస బేసిక్ జీతం ఏకంగా రూ.50,000కి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story