8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కసరత్తు వేగవంతమైంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలోని సివిల్ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) ప్రభుత్వం ముందు విస్తుపోయేలా భారీ డిమాండ్లను ఉంచింది. వేతనాల పెంపుతో పాటు, తమను కూడా రైల్వే ఉద్యోగులతో సమానంగా చూడాలని, రిస్క్ అలవెన్స్ పెంచాలని గట్టిగా కోరుతోంది. బుధవారం న్యూఢిల్లీలో 8వ వేతన సంఘం ఛైర్‌పర్సన్ రంజనా ప్రకాష్ దేశాయ్‌తో జరిగిన భేటీలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చాయి.

డిఫెన్స్ సివిల్ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా వివక్షకు గురవుతున్నారని ఏఐడీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి సి. శ్రీకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ రైల్వేలు, రక్షణ మంత్రిత్వ శాఖ రెండూ ప్రభుత్వంలోని అతిపెద్ద పారిశ్రామిక విభాగాలు. అయినప్పటికీ, రైల్వే ఉద్యోగులకు లభించే వేతన శ్రేణులు, ప్రమోషన్లు, ఇతర సౌకర్యాలు తమకు అందడం లేదని వారు వాదిస్తున్నారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, ప్రమాదకరమైన రసాయనాలతో ప్రాణాలకు తెగించి పనిచేసే తమకు సరైన గుర్తింపు లేదని వారు పేర్కొన్నారు.

ప్రస్తుత ధరల పెరుగుదల, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, ఎంట్రీ లెవల్ ఉద్యోగి కనీస వేతనాన్ని రూ.69,000కి పెంచాలని సంఘం డిమాండ్ చేసింది. దీనితో పాటు, అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83 కు పెంచాలని కోరింది. ఇదే జరిగితే ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. అలాగే, ఎంతో కాలంగా వివాదాస్పదంగా మారిన కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

రక్షణ రంగ సివిల్ ఉద్యోగులు సరిహద్దుల్లో, ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో సైనికులతో భుజం భుజం కలిపి పనిచేస్తున్నారని, కానీ వారికి రిస్క్ అలవెన్స్ అందడం లేదని ఫెడరేషన్ గుర్తు చేసింది. నెలకు రూ.15,000 రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు అమరవీరుల హోదా కల్పించాలని కోరారు. ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.25 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

30 ఏళ్ల సర్వీసులో 5 ప్రమోషన్లు

ఉద్యోగుల కెరీర్ గ్రోత్ విషయంలో కూడా ఏఐడీఈఎఫ్ కీలక ప్రతిపాదనలు చేసింది. గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు తమ 30 ఏళ్ల సర్వీసు కాలంలో ఎంఏసీపీ పథకం కింద కనీసం 5 ప్రమోషన్లు కల్పించాలని కోరారు. దీనితో పాటు సీజీహెచ్ఎస్ మెడికల్ సదుపాయాలను మెరుగుపరచాలని, మహిళలు, దివ్యాంగ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లపై 8వ వేతన సంఘం ఎలా స్పందిస్తుందోనని లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story