8th Pay Commission: 8వ వేతన సంఘం సిఫార్సుల అమలు 2028 వరకు వాయిదా పడితే, ప్రస్తుతానికి ప్రభుత్వ ఖర్చుపై కాస్త ఉపశమనం లభించినా, బకాయిలు పెరిగి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుందని డ్యూష్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 8వ వేతన సంఘం వల్ల ప్రభుత్వ వ్యయం కనీసం రూ.3 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల FY28 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు తగ్గించుకునే ప్రణాళికలకు ఇబ్బంది కలగవచ్చని పేర్కొంది. 2027 వరల్డ్ అవుట్‌లుక్ నివేదికలో FY28 నాటికి కేంద్ర ఆర్థిక లోటు జీడీపీలో 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ముడి చమురు అధిక ధరలు, సబ్సిడీ వ్యయం, ఆర్బీఐ డివిడెండ్‌లో తగ్గుదల వంటి అంశాలు కూడా ఖజానాపై ఒత్తిడి పెంచవచ్చని తెలిపింది.

బకాయిల భారం ఎందుకు పెరుగుతుంది?

8వ వేతన సంఘం అమలును 2028 వరకు ఆలస్యం చేయడం వల్ల తక్షణమే నగదు బయటకు వెళ్లకుండా ఆపవచ్చు కానీ, చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుందని డ్యూష్ బ్యాంక్ స్పష్టం చేసింది. నిబంధనల మేరకు నిర్ణీత సమయంలోనే వేతన సవరణ అమలు చేయడం మంచిదని సూచించింది. ఒకవేళ గత తేదీ నుంచి వేతన పెంపు వర్తింపజేస్తే, ఆలస్యమైన కొద్దీ బకాయిల కాలపరిమితి పెరిగి ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సి వస్తుంది. 2027 నుంచే సిఫార్సులు అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని బ్యాంక్ అంచనా వేసినా, తుది నిర్ణయం, అమలు తేదీలు పూర్తిగా కేంద్రంపైనే ఆధారపడి ఉంటాయి.

FY27 ఆర్థిక లోటు లక్ష్యంపై అంచనా ఇదే

FY27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 4.3 శాతం ఆర్థిక లోటు లక్ష్యాన్ని కేంద్రం చేరుకోగలదని డ్యూష్ బ్యాంక్ భావిస్తోంది. ఆర్బీఐ నుంచి అంచనా వేసిన రూ.2.9 లక్షల కోట్ల డివిడెండ్, ఆర్థిక స్థిరీకరణ నిధి కింద రూ.1 లక్షల కోట్ల కేటాయింపు, మూలధన వ్యయంలో కొంత తగ్గుదల, డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చే ఆదాయం ఈ లక్ష్యానికి తోడ్పడతాయని వివరించింది. 8వ వేతన సంఘానికి అంచనా వేసిన రూ.3 లక్షల కోట్ల ఖర్చు, FY27 ఆర్బీఐ డివిడెండ్ అంచనా కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ అవి వేర్వేరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు అని స్పష్టం చేసింది.

ఆర్థిక వృద్ధికి ఊతం.. ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగితే దేశీయ వినియోగం, డిమాండ్ పుంజుకుంటాయని నివేదిక తెలిపింది. భారత వాస్తవ జీడీపీ వృద్ధి FY27లో 7.3 శాతం, FY28లో 7.2 శాతం, FY29లో 7.3 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంది. 2027-28 బడ్జెట్ దగ్గర పడుతున్న వేళ, వేతన సంఘం ఖర్చును సర్దుబాటు చేస్తూనే ఆర్థిక క్రమశిక్షణ కాపాడటం ప్రభుత్వ ముందున్న కీలక సవాలు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన తుది నివేదిక, నిర్ణయాలు రాబోయే నెలల్లో వెలువడే అవకాశం ఉంది.

Next Story