8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జీతం.. రూ.55,000 కనీస వేతనం కోసం కొత్త డిమాండ్
రూ.55,000 కనీస వేతనం కోసం కొత్త డిమాండ్

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపునకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను కమిషన్ ముందు ఉంచుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, వేతన సంఘం అధికారులతో శ్రీనగర్‌లో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఉద్యోగుల బేసిక్ శాలరీని భారీగా పెంచాలని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతన సవరణలు జరగాలని వారు గట్టిగా కోరారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు రఫీక్ మాలిక్ మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న జీతాల నిర్మాణం పెరిగిన ఖర్చులకు, కుటుంబాల అవసరాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం వారు ఒక సరికొత్త లెక్కను కమిషన్ ముందు ఉంచారు. గతంలో 7వ వేతన సంఘం ఒక కుటుంబంలో ముగ్గురిని ప్రాతిపదికగా తీసుకుని వేతనాన్ని లెక్కించింది. కానీ, ఇప్పుడు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులను కలిపి మొత్తం ఐదుగురిని ఒక కుటుంబ యూనిట్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త ఫార్ములా ప్రకారం ఒక్కో వ్యక్తి ఖర్చుల నిమిత్తం నెలకు రూ.6,000 చొప్పున లెక్కిస్తే ఐదుగురికి రూ.30,000 బేసిక్ శాలరీ అవుతుంది. దీనికి ప్రస్తుతమున్న 58 శాతం కరువు భత్యం కలిపితే ఆ మొత్తం రూ.47,400కు చేరుకుంటుంది. దీనికి తోడు నిత్యావసరాలు, ఆహారపదార్థాల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే కనీస బేసిక్ శాలరీ రూ.55,000 నుండి రూ.60,000 మధ్య ఉండాలని వారు స్పష్టం చేశారు.
జీతాల పెంపుతో పాటు ఉద్యోగులందరికీ ప్రయోజనం చేకూరేలా ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.05 శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుత జీతాల కంటే ఇది చాలా మెరుగైన వృద్ధిని ఇస్తుందని వారు భావిస్తున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం అమల్లో ఉన్న 3 శాతం వార్షిక జీతన వృద్ధి చాలా తక్కువగా ఉందని, మార్కెట్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి వీలుగా ఈ వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని వారు 8వ వేతన సంఘాన్ని కోరారు. దీనివల్ల ఉద్యోగుల నిజమైన ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని వివరించారు.
కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం లెక్కింపు ప్రక్రియలో కూడా పెద్ద మార్పులు చేయాలని సమాఖ్య డిమాండ్ చేసింది. డీఏ లెక్కింపులో వచ్చే దశాంశ భాగాలను తగ్గించకుండా, పెరిగిన ప్రతి పైసానూ ఉద్యోగులకు అందించాలని కోరారు. అలాగే, డీఏ 50 శాతానికి చేరుకున్న వెంటనే దానిని పూర్తిగా బేసిక్ శాలరీలో విలీనం చేయాలని, ఆ తర్వాతే కొత్త హెచ్‌ఆర్‌ఏ రేట్లను అమలు చేయాలని సూచించారు. దీనికోసం హెచ్‌ఆర్‌ఏ పెంపునకు ఉన్న డీఏ పరిమితిని 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని వారు సరికొత్త ప్రతిపాదనను కమిషన్ ముందు ఉంచారు.
కొత్త పెన్షన్ విధానం పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, ఎన్‌పీఎస్‌ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ను ఈ సమావేశంలో మరోసారి బలంగా వినిపించారు. వీటితో పాటు కశ్మీర్ వంటి అత్యంత కఠినమైన వాతావరణం, దుర్గమ ప్రాంతాలలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వారి బేసిక్ శాలరీలో అదనంగా 10 శాతాన్ని హార్డ్ జోన్ అలవెన్స్ రూపంలో చెల్లించాలని కోరారు. ఒకవేళ 8వ వేతన సంఘం గనుక ఈ డిమాండ్లను పరిశీలించి ఆమోదిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

