8th Pay Commission : 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తప్పదా?
ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తప్పదా?

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జీతభత్యాల సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం తన పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలతో ఈ ప్యానెల్ చివరి రౌండ్ చర్చలు జరుపుతోంది. అయితే, కొత్త జీతాల స్థాయిని నిర్ణయించే అత్యంత కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఈసారి కమిషన్ చాలా అప్రమత్తంగా, పొదుపుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేస్తూ ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
ఉద్యోగ సంఘాల భారీ డిమాండ్లు
కొత్త వేతన సవరణలో భాగంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు తమ డిమాండ్లను భారీ స్థాయిలోనే కమిషన్ ముందు ఉంచారు. ప్రస్తుతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి ఏకంగా 3.68 లేదా 3.83 రెట్లు పెంచాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం 3.68 శాతానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, కనీస బేసిక్ శాలరీ ప్రస్తుతం ఉన్న రూ. 18,000 నుండి నేరుగా రూ. 26,000 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కొందరైతే దీనిని రూ.69,000 వరకు తీసుకెళ్లాలని మెమోరాండం సమర్పించారు.
ఆర్థిక భారంపై ప్రభుత్వాల ఆందోళన
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఈ విషయమై స్పందిస్తూ, ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి, వివిధ రాష్ట్రాల ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణాన్ని కూడా వేతన సంఘం పరిగణనలోకి తీసుకుంటోందని తెలిపారు. జీతాలు, పెన్షన్లను భారీగా పెంచితే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా తట్టుకోలేనంత ఆర్థిక భారం పడుతుంది. అందుకే, ప్రారంభ చర్చల ప్రకారం ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గత 7వ వేతన సంఘం అమలు చేసిన 2.57 మల్టిప్లైయర్ ఆసప్రాంతంలోనే ఉంచాలని కమిషన్ భావిస్తున్నట్లు లీకులు అందుతున్నాయి.
వివిధ రాష్ట్రాలలో ముగిసిన చర్చల పర్వం
ఈ వేతన సంఘానికి తమ డిమాండ్ల మెమోరాండం సమర్పించే గడువు జూన్ 15తో ముగిసింది. దీంతో ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల అధికారిక డిమాండ్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు ఈ ప్యానెల్ ఢిల్లీ, లడఖ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి అనేక ప్రాంతాల్లో వివిధ స్టేక్‌హోల్డర్లతో సమావేశాలు నిర్వహించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను, సమాచారాన్ని వేతన సంఘం నిశితంగా పరిశీలిస్తోంది.
రిపోర్ట్ డ్రాఫ్టింగ్, పాత రికార్డులు
అన్ని రాష్ట్రాలు, సంఘాలతో సంప్రదింపులు పూర్తయిన తర్వాత, కమిషన్ ఈ డేటా మొత్తాన్ని క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే తుది నివేదిక డ్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తుంది. గతంలో 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసినప్పుడు, ప్రభుత్వ కనీస వేతనం రూ. 7,000 నుంచి రూ. 18,000 కు పెరిగింది. కానీ, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం 2015-16 నాటి 4.8 శాతం నుంచి ఒక్కసారిగా 2016-17 నాటికి 9.9 శాతానికి పెరిగిపోయింది. ఈసారి అలాంటి భారం పడకుండా చూడటమే 8వ వేతన సంఘం ముందున్న అతిపెద్ద సవాలు.

