8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. 8వ వేతన సంఘంలో మారనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
8వ వేతన సంఘంలో మారనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పై ఒక బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. కొత్త వేతన సంఘం అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి? అనే విషయం పూర్తిగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే ఉద్యోగుల కొత్త బేసిక్ శాలరీతో పాటు వారికి వచ్చే ఇతర అలవెన్సులు కూడా మారుతాయి. లెవెల్-1 నుంచి లెవెల్-13 వరకు ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల నెలవారీ ఆదాయం ఈ నిర్ణయంతో భారీగా పెరగనుంది. అసలు ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? దీనిని 2, 2.5 లేదా 3 శాతంగా నిర్ణయిస్తే ఉద్యోగుల జీతాలు, హెచ్‌ఆర్‌ఏ లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే అసలు ఏంటి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపును నిర్ణయించే ఒక ముఖ్యమైన మల్టిప్లైయర్ లేదా గుణకాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ శాలరీని ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించి, వారి కొత్త బేసిక్ శాలరీని ఖరారు చేస్తారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రస్తుత బేసిక్ శాలరీ రూ.20,000 ఉందనుకుందాం. ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.5 గా నిర్ణయిస్తే, అతని కొత్త బేసిక్ శాలరీ రూ.50,000కు పెరుగుతుంది. ఈ కొత్త బేసిక్ శాలరీ ఆధారంగానే భవిష్యత్తులో వచ్చే కరువు భత్యం,హెచ్‌ఆర్‌ఏ, ఇతర భత్యాలను లెక్కిస్తారు.
2, 2.5, 3 ఫ్యాక్టర్ల వల్ల వచ్చే లాభాలు
వస్తున్న నివేదికల ప్రకారం.. ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2 గా ఖరారు చేస్తే ఉద్యోగుల బేసిక్ శాలరీ ప్రస్తుత స్థాయి కంటే నేరుగా రెట్టింపు అవుతుంది. అదే గనుక ఈ ఫ్యాక్టర్‌ను 2.5 గా నిర్ణయిస్తే జీతాలలో మరింత ఎక్కువ పెంపు కనిపిస్తుంది. ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరుకున్నట్లుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 గా అమలు చేస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ, హెచ్‌ఆర్‌ఏ ఊహించని రేంజ్‌లో పెరుగుతాయి. లెవెల్-1 నుంచి లెవెల్-13 కేటగిరీల వరకు ఉన్న ఉద్యోగులందరిపై వారి ప్రస్తుత జీతాల ఆధారంగా ఈ ప్రభావం విభిన్నంగా ఉంటుంది.
హెచ్‌ఆర్‌ఏ పై పడే నేరుగా ప్రభావం
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల వచ్చే లాభం కేవలం బేసిక్ శాలరీ పెంపుతోనే ఆగిపోదు. ఉద్యోగులకు లభించే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా కొత్త బేసిక్ శాలరీ ఆధారంగానే మారుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు పనిచేసే నగరాలను బట్టి వారికి 27%, 18% లేదా 9% చొప్పున హెచ్‌ఆర్‌ఏ లభిస్తోంది. బేసిక్ శాలరీ పెరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ హెచ్‌ఆర్‌ఏ రూపంలో వచ్చే డబ్బు కూడా భారీగా పెరుగుతుంది. అందుకే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఎక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ తుది నిర్ణయం కోసం నిరీక్షణ
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేసినప్పటికీ, ఈ కమిటీలోని సభ్యులు, వారి పనితీరు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలనే విషయాలపై ఇంకా అఫీషియల్ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగ సంఘాలు మాత్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.5 నుండి 3 మధ్యలో ఉంచాలని గట్టిగా కోరుతున్నాయి. అయితే వేతన సంఘం ఇచ్చే సిఫార్సులను పరిశీలించిన తర్వాతే కేంద్ర క్యాబినెట్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

