8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భారీ శుభవార్త వినిపిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎనిమిదో వేతన సంఘం ద్వారా వేతనాల్లో భారీ పెరుగుదల ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం రూ.18,000గా ఉన్న బేసిక్ పే ఏకంగా రూ.69,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరగనున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెరుగుదల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 18,000 ప్రాథమిక వేతనాన్ని 69,000కు పెంచాలంటే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833 గా నిర్ణయించాలని నేషనల్ కౌన్సిల్ - జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) ప్రతిపాదించింది. అంటే ప్రస్తుత బేసిక్ పే మీద దాదాపు 3.83 రెట్లు పెరగాలని వారి ఉద్దేశ్యం. గత వేతన సంఘంలో ప్రభుత్వం దీనిని 2.57గా నిర్ణయించింది, కానీ ఈసారి భారీగా పెంచాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.

ఈ భారీ వేతన పెరుగుదల డిమాండ్ వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. గతంలో ఒక ఉద్యోగి కుటుంబాన్ని ముగ్గురు వ్యక్తులుగా పరిగణించేవారు, కానీ ఇప్పుడు దానిని ఐదుగురు సభ్యులుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం.. ఒక వ్యక్తికి అవసరమైన క్యాలరీల పరిమితిని 3,490గా లెక్కగట్టారు. పెరిగిన కుటుంబ సభ్యులు, వారి ఆహార అవసరాలు, విద్య, ఆరోగ్యం వంటి ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ రూ.69,000 సంఖ్యను ఖరారు చేశారు.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

ఉద్యోగులు అడిగినంత ప్రభుత్వం ఇస్తుందా అంటే.. చరిత్రలో అది జరగలేదని చెప్పవచ్చు. 7వ వేతన సంఘం సమయంలో కూడా ఉద్యోగులు 3.71 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అడగగా, ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులను చూసి 2.57 వద్ద ఆపేసింది. ఈసారి కూడా చర్చలు సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. ప్రభుత్వం బడ్జెట్ లోటును దృష్టిలో ఉంచుకుని మధ్యస్థంగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయినప్పటికీ, కనీస వేతనం మాత్రం భారీగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ప్రస్తుత సమాచారం ప్రకారం.. 8వ వేతన సంఘం తన తుది నివేదికను సమర్పించడానికి మే 2027 వరకు సమయం పట్టవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ రిపోర్టును పరిశీలించి, కొన్ని మార్పులు చేసి అమలు చేయడానికి మరో 3 నుంచి 6 నెలలు పడుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే, 2027 ద్వితీయార్ధంలో (రెండో సగంలో) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పెరిగిన జీతాలు జమ అవ్వడం ప్రారంభమవుతుంది. సుమారు ఒక కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story