8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. 8వ వేతన సంఘంలో పెన్షన్ నిబంధనలు మార్పు
8వ వేతన సంఘంలో పెన్షన్ నిబంధనలు మార్పు

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చల్లో సరికొత్త పెన్షన్ వ్యవస్థ ఒక హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ పెంపు మాత్రమే కాకుండా.. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు గరిష్ట ఆర్థిక భద్రత కల్పించేలా పలు కీలక సూచనలు తెరపైకి వచ్చాయి. వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి, కనీసం ఇద్దరు సభ్యులున్న కుటుంబాన్ని సాకడానికి వీలుగా పెన్షన్ విధానంలో మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.
బేసిక్ పెన్షన్ పెంచాలని ఎన్‌సీ-జేసీఎమ్ డిమాండ్
నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) 8వ వేతన సంఘానికి సమర్పించిన నివేదికలో ఒక కీలక ప్రతిపాదనను ఉంచింది. దీని ప్రకారం, రిటైర్ అయిన తర్వాత ఇచ్చే పూర్తి పెన్షన్ మొత్తాన్ని.. ఉద్యోగి చివరిసారిగా తీసుకున్న జీతం లేదా చివరి 10 నెలల సగటు జీతంలో 67 శాతానికి పెంచాలని కోరింది. ప్రస్తుతం ఈ పెన్షన్ కేవలం 50 శాతంగా మాత్రమే ఉంది. దీనితో పాటు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను కూడా వారు ప్రస్తావించారు.
వయసు పెరిగే కొద్దీ పెరగనున్న పెన్షన్
వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతాయి కాబట్టి, ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్ మొత్తాన్ని 5 శాతం చొప్పున అదనంగా పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వయసును బట్టి పెన్షన్ కింది విధంగా ఉంటుంది:
* 65 ఏళ్ల వయసులో: చివరి జీతంలో 70 శాతం పెన్షన్
* 70 ఏళ్ల వయసులో: 75 శాతం పెన్షన్
* 75 ఏళ్ల వయసులో: 80 శాతం పెన్షన్
* 80 ఏళ్ల వయసులో: 85 శాతం పెన్షన్
* 85 ఏళ్ల వయసులో: 90 శాతం పెన్షన్
* 90 ఏళ్ల వయసులో: ఏకంగా 100 శాతం పూర్తి పెన్షన్ లభిస్తుంది.
నచ్చిన పెన్షన్ స్కీమ్ ఎంచుకునే లక్కీ ఛాన్స్
ఈ సరికొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగులకు తమ అవసరాలకు తగినట్లుగా పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకునే స్వేచ్ఛను కల్పించబోతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మూడు రకాల పెన్షన్ విధానాలైన పాత పెన్షన్ విధానం (OPS), జాతీయ పెన్షన్ విధానం (NPS), కొత్తగా తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)లలో దేనినైనా ఎంచుకునే అవకాశాన్ని ఉద్యోగులకు ఇవ్వాలని కోరుతున్నారు.
మూడు పెన్షన్ స్కీముల మధ్య తేడాలు ఇవే
* పాత పెన్షన్ స్కీమ్ (OPS): ఇందులో రిటైర్మెంట్ తర్వాత చివరి జీతం, డీఏ ఆధారంగా స్థిరమైన పెన్షన్ వస్తుంది. దీనికి ఉద్యోగులు తమ జీతం నుంచి ఎలాంటి కట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
* నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS): ఇది పూర్తిగా మార్కెట్ ఆధారిత పెట్టుబడి పథకం. ఇందులో ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ కొంత మొత్తాన్ని జమ చేస్తారు. రిటైర్మెంట్ సమయంలో మార్కెట్ రిటర్న్స్ ఆధారంగా పెన్షన్ లభిస్తుంది.
* యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS): దీనిని ఓపీఎస్, ఎన్‌పీఎస్ ల కలయికగా తెచ్చారు. ఇందులో ఎన్‌పీఎస్ తరహాలోనే ప్రతి నెల కటింగ్స్ ఉంటాయి, కానీ రిటైర్ అయ్యాక మాత్రం ఓపీఎస్ లాగా నిర్ణీత పెన్షన్ గ్యారెంటీగా వస్తుంది.
కోటికి పైగా కుటుంబాలపై ప్రభావం
పెన్షన్ అనేది షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉండకూడదని, వృద్ధులకు సురక్షితమైన, స్థిరమైన ఆదాయం లభించాలని ఉద్యోగ సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ఈ 8వ వేతన సంఘం నిర్ణయాల వల్ల దేశంలోని దాదాపు 1.1 కోట్లకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. భారతదేశంలో ఇప్పటివరకు 7 వేతన సంఘాలు రాగా, 8వ వేతన సంఘాన్ని 3 నవంబర్ 2025న ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.

