8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న వేళ, రైల్వే ఉద్యోగులు తమ డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) తాజాగా వేతన సంఘానికి ఒక భారీ మెమోరాండం సమర్పించింది. ఇందులో కనీస వేతనాన్ని ఏకంగా రూ.52,600కి పెంచాలని కోరడమే కాకుండా, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 5 రెట్లు పెంచాలంటూ సంచలన ప్రతిపాదనలు చేసింది. ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) తన మెమోరాండంలో ఉద్యోగుల బాధ్యతలు, వారు ఎదుర్కొనే రిస్క్ ఆధారంగా వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను ఉండాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా లెవల్ 1 నుంచి 5 వరకు ఉన్న ఉద్యోగులకు 2.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని, అదే అత్యున్నత స్థాయిలోని లెవల్ 17, 18 అధికారులకు 4.38 వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని కోరింది. రైల్వేలో పని చేసే టెక్నికల్ సిబ్బంది విధుల్లో ఎంతో క్లిష్టత ఉంటుందని, వారు అదనపు గంటలు శ్రమించాల్సి ఉంటుందని అసోసియేషన్ గుర్తుచేస్తోంది. అందుకే నాన్-టెక్నికల్ సిబ్బందితో పోలిస్తే టెక్నికల్ ఉద్యోగులకు మెరుగైన వేతనం అందించడం ద్వారా వారి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందని అసోసియేషన్ బలంగా వాదిస్తోంది.

కొత్త క్యాడర్, భారీగా పెరగనున్న జీతాల అంచనా

సాంకేతిక పర్యవేక్షకుల కోసం అసోసియేషన్ సరికొత్త కేడర్ నిర్మాణాన్ని, జీతాల లెక్కలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలు అమలైతే రైల్వేలో జూనియర్ ఇంజనీర్ (JE) హోదాలో ఉన్న లెవల్-7 ఉద్యోగి కనీస వేతనం రూ.1,57,400 కు చేరుకుంటుంది. అదేవిధంగా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) హోదాలో ఉన్న లెవల్-8 ఉద్యోగికి రూ.1,66,800 కనీస వేతనంగా లభిస్తుంది. ఇక సీనియర్ మేనేజర్ స్థాయిలోని ప్రిన్సిపల్ SSE (లెవల్-11) ఉద్యోగుల జీతం ఏకంగా రూ. 2,57,000 వరకు ఉండవచ్చని అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఈ పెంపు రైల్వే టెక్నికల్ విభాగంలో పని చేసే వేలాది మందికి భారీ ఊరటనిచ్చే అవకాశం ఉంది.

అలవెన్సులు, హెచ్‌ఆర్ఏలో విప్లవాత్మక మార్పులు

ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (HRA) విషయంలో కూడా IRTSA కీలక మార్పులను కోరింది. జనాభా ప్రాతిపదికన నగరాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని, 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న A కేటగిరీ నగరాల్లో నివసించే వారికి 40 శాతం HRA తో పాటు డియర్నెస్ అలవెన్స్ (DA) కలిపి ఇవ్వాలని ప్రతిపాదించింది. వీటితో పాటు నైట్ డ్యూటీ అలవెన్స్ చెల్లింపుల్లో ఉన్న ప్రస్తుత రూ.43,600 సీలింగ్ పరిమితిని పూర్తిగా ఎత్తివేయాలని కోరింది. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ప్రతి గంటకూ ఉద్యోగి హోదా, ప్రస్తుత జీతం ఆధారంగా సరైన వేతనం చెల్లించాలని డిమాండ్ చేసింది.

పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర సంక్షేమ పథకాలు

రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో రైల్వే ఉద్యోగుల సంఘం చాలా స్పష్టమైన డిమాండ్లను ముందుకు తెచ్చింది. 2004 తర్వాత విధుల్లో చేరిన వారందరికీ పాత పెన్షన్ స్కీమ్ (OPS) వర్తింపజేయాలని కోరుతోంది. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. సెలవుల నగదీకరణ (లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) పరిమితిని 300 రోజుల నుంచి 600 రోజులకు పెంచాలని, తద్వారా రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఎక్కువ ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తెలిపింది. అంతేకాకుండా, ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్య కోసం ఇచ్చే అలవెన్స్‌ను నెలకు రూ.10,000కు పెంచడం ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story