8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం గురించిన తాజా సమాచారం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. వేతన సంఘం రిపోర్ట్ అమలు కావడంలో ఆలస్యం జరిగే కొద్దీ, ఉద్యోగులకు ఏరియర్స్ రూపంలో అందే భారీ మొత్తం కూడా అంతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వేతన సంఘం వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ చర్చిస్తోంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా పరిగణలోకి తీసుకుంటే, లెవెల్ 6 నుంచి లెవెల్ 8 వరకు గల ఉద్యోగులకు ఒకేసారి లక్షలాది రూపాయలు ఏరియర్ రూపంలో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా లెవెల్ 8 ఉద్యోగులకు ఈ మొత్తం సుమారు రూ.18 లక్షల వరకు అందే అవకాశం ఉంది.

వేతన సంఘం సమావేశాల తాజా అప్‌డేట్స్

ఇప్పటికే జైపూర్, చెన్నై, పుదుచ్చేరి అలాగే చండీగఢ్‌లో కీలక సమావేశాలను పూర్తి చేసుకున్న 8వ వేతన సంఘం, తదుపరి సమావేశాన్ని అక్టోబర్ 7 నుంచి 8 తేదీల మధ్య బెంగళూరులో నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్‌లో ఈ వేతన సంఘానికి రిపోర్ట్ సమర్పించడానికి 18 నెలల గడువును కేటాయించింది. దీని ప్రకారం 2027 మే నాటికి సంఘం తన తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే గత వేతన సంఘాల చరిత్రను పరిశీలిస్తే మరో 3 నుంచి 6 నెలలు అదనంగా పట్టే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం 2027 మార్చి నుంచి ఆగస్టు మధ్య ఈ నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది.

ఏయే భత్యాలపై లభిస్తుంది?

చాలా మంది ఉద్యోగులకు అన్ని రకాల అలవెన్స్‌లపై ఏరియర్ వస్తుందా అనే సందేహం ఉంటుంది. నిబంధనల ప్రకారం కేవలం బేసిక్ పే నష్టపోయిన మొత్తానికి మాత్రమే ఏరియర్ వర్తిస్తుంది. ఇల్లు అద్దె భత్యం నేరుగా బేసిక్ సాలరీతో ముడిపడి ఉంటుంది కాబట్టి బేసిక్ పెరిగితే HRA కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇక ట్రావెల్ అలవెన్స్ అనేది కరువు భత్యం ఆధారంగా మారుతుంది. అందువల్ల ఈ భత్యాలపై ప్రత్యేకంగా ఎరియర్ ఉండదు. మొత్తం లెక్క అంతా పాత బేసిక్ సాలరీకి, కొత్త బేసిక్ సాలరీకి మధ్య జరిగే పెరుగుదలపైనే ఆధారపడి ఉంటుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లెక్కలు

నివేదిక అమలులో 20 నుంచి 24 నెలల వరకు ఆలస్యం జరిగితే వచ్చే ఏరియర్ పూర్తిగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే లెవెల్ 8 ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ సాలరీ రూ.47,600 నుంచి రూ.1,22,332కి పెరుగుతుంది. అంటే ప్రతినెల రూ.74,732 అదనంగా లభిస్తుంది. 24 నెలలు ఆలస్యం అయితే దాదాపు రూ.17,93,568 ఎరియర్ వస్తుంది. ఇక లెవెల్ 6 ఉద్యోగులకు రూ.13,33,872 వరకు, లెవెల్ 7 ఉద్యోగులకు దాదాపు రూ.16,91,832 వరకు ఎరియర్ లభించే అవకాశం ఉంది.

Next Story