8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సుల సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం తన పనులను వేగవంతం చేసింది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలో పనిచేస్తున్న ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సంబంధిత భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. మే-జూన్ 2027 నాటికి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. గతంలో వచ్చిన 7వ వేతన సంఘం ఆధారంగా రాబోయే 8వ వేతన సంఘంలో ఎలాంటి కీలక మార్పులు రానున్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పే మ్యాట్రిక్స్, బేసిక్ పే స్కేళ్లలో మార్పులు

7వ వేతన సంఘం పాత గ్రేడ్ పే విధానాన్ని రద్దు చేసి కొత్తగా పే మ్యాట్రిక్స్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీనివల్ల ఉద్యోగుల హోదా, అనుభవం ఆధారంగా పే లెవల్స్‌ను నిర్ణయించారు. ఇప్పుడు రాబోయే 8వ వేతన సంఘం ప్రస్తుత పే మ్యాట్రిక్స్‌ను మరింత సరళీకృతం చేసే అవకాశం ఉంది. బేసిక్ పే లెవల్స్‌ను సవరించడం ద్వారా కింది స్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి అధికారుల వరకు వేతనాల్లో చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల ఉండవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్లు.. పెరుగుతున్న అంచనాలు

7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేయగా, ఈసారి ఉద్యోగ సంఘాలు (BPMS, NC-JCM) 3.5 నుంచి 4.0 వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చేలా ఒత్తిడి తెస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్ నెరవేరితే బేసిక్ పే భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో ఉద్యోగుల చేతికి వచ్చే నికర జీతం రూపురేఖలే మారిపోనున్నాయి.

కనీస వేతనం రూ.18,000 నుంచి భారీగా పెంపు?

గత వేతన సంఘంలో కనీస బేసిక్ శాలరీ రూ.7,000 నుంచి ఒక్కసారిగా రూ.18,000కు పెరిగింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం, రోజువారీ జీవన వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో 8వ వేతన సంఘం కనీస వేతనాన్ని మరింత పెంచే యోచనలో ఉంది. కనీస వేతనం ఎంత పెరిగితే దానికి అనుగుణంగా మొత్తం పే మ్యాట్రిక్స్ నిర్మాణం మారడంతో పాటు ఉద్యోగులందరి ఆదాయం పెరుగుతుంది.

అలవెన్సులు, కరవు భత్యం పునర్వ్యవస్థీకరణ

7వ పే కమిషన్ 197 రకాల అలవెన్సులను సమీక్షించి 53 అలవెన్సులను రద్దు చేసింది. మరో 37 అలవెన్సులను వేర్వేరు విభాగాల్లో విలీనం చేసింది. ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా అలవెన్సుల్లో కీలక మార్పులు తెచ్చింది. 8వ వేతన సంఘం కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా హెచ్‌ఆర్‌ఏ, ఇతర భత్యాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. దీనికితోడు ఏటా ఇచ్చే 3 శాతం ఇంక్రిమెంట్ విధానాన్ని కొనసాగిస్తారా లేదా కొత్త నమూనాను ప్రవేశపెడతారా అనేది తేలాల్సి ఉంది.

8వ వేతన సంఘం సిఫార్సులు కేవలం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కే పరిమితం కాకుండా బేసిక్ పే, అలవెన్సులు, పెన్షన్లపై సుదీర్ఘ ప్రభావం చూపనున్నాయి. రాబోయే రోజుల్లో జైపూర్, చండీగఢ్ ప్రాంతాల్లో జరగనున్న సమావేశాల తర్వాత ఉద్యోగుల జీతాల పెంపుపై మరిన్ని స్పష్టమైన వివరాలు బయటకు రానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story