8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి లక్షల రూపాయల బకాయిలు..ఎప్పుడంటే?
ఖాతాల్లోకి లక్షల రూపాయల బకాయిలు..ఎప్పుడంటే?

8th Pay Commission : కొత్త ఏడాది 2026 ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో 8వ వేతన సంఘం పై ఆశలు చిగురించాయి. పెరిగే జీతాలు ఎప్పటి నుంచి చేతికి అందుతాయి? పాత బకాయిలు (ఎరియర్స్) ఎలా వస్తాయి? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. టెక్నికల్‌గా చూస్తే 8వ వేతన సంఘం అమలు అనేది జనవరి 1, 2026 నుంచే ప్రారంభం కావాలి. అంటే ఉద్యోగుల హక్కు ఈ తేదీ నుంచే మొదలవుతుంది. అయితే ప్రభుత్వ ప్రక్రియలు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. నిపుణుల అంచనా ప్రకారం.. వేతన సంఘం తన నివేదికను సిద్ధం చేయడానికి సుమారు 18 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం, ఇతర పరిపాలనాపరమైన అనుమతులకు మరో 6 నెలలు పట్టవచ్చు. అంటే ప్రతిదీ అనుకున్నట్లు జరిగితే, పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లోకి చేరడానికి జనవరి 2028 వరకు సమయం పట్టవచ్చు. ఒకవేళ ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం జూలై 2027లోనే శుభవార్త వినే అవకాశం ఉంది.
వేతన సంఘం అమలు ఆలస్యం కావడం వల్ల పెరిగిన జీతం బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో పోగవుతుంది. మరి ఈ డబ్బును ప్రభుత్వం కిస్తీల వారీగా ఇస్తుందా లేక ఒకేసారి ఇస్తుందా అన్న సందేహం చాలామందిలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ చరిత్రను పరిశీలిస్తే, గతంలో వేతన బకాయిలను ఎప్పుడూ కూడా ఒకే విడతలో చెల్లించారు. కాబట్టి 2026 జనవరి నుంచి అమలు కావాల్సిన జీతాల పెంపును ఏ రెండు మూడేళ్ల తర్వాత ప్రకటించినా, ఆ పాత బకాయిలన్నీ కలిపి ఉద్యోగులకు ఒకేసారి భారీ మొత్తంలో చెల్లించే అవకాశం ఉంది.
బకాయిలు ఒకేసారి వస్తాయి కదా అని సంతోషపడటంలో అర్థం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేతన సంఘం అమలు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎందుకంటే జీతంలో భాగమైన హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటివి అమలు చేసిన తేదీ నుంచే మారుతాయి కానీ, వెనకటి తేదీల నుంచి వీటికి ఎరియర్స్ ఇవ్వరు. దీనివల్ల లెవల్-8 స్థాయి అధికారికి సుమారు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంటే బకాయిలు వచ్చినా, ఈ అలవెన్సుల రూపంలో వచ్చే అదనపు లబ్ధిని ఉద్యోగులు కోల్పోతున్నారు.
ప్రస్తుతం కరువు భత్యం (DA) ఇప్పటికే 50 శాతం మార్కును దాటేసింది. నిబంధనల ప్రకారం డీఏ 50 శాతం దాటిన వెంటనే దాన్ని బేసిక్ జీతంలో కలిపేయాలి. కానీ ప్రభుత్వం ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల కూడా ఉద్యోగులు తమకు రావాల్సిన అసలైన జీతం కంటే తక్కువ మొత్తాన్ని గత రెండేళ్లుగా అందుకుంటున్నారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తేనే ఈ వ్యత్యాసాలన్నీ తొలగిపోయి, ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం ఇప్పుడు కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు.

